రాజమౌళి (X) హిరాణి: ఫాల్కే బయోపిక్ హక్కులు ఎవరికి?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఒకే ప్రముఖుని జీవితకథతో సినిమా తీయాలని భావించడం యాథృచ్ఛికం.;
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఒకే ప్రముఖుని జీవితకథతో సినిమా తీయాలని భావించడం యాథృచ్ఛికం. కానీ ఆ ఇద్దరూ వేర్వేరు ప్రకటనల్లో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కిస్తున్నామని ప్రకటించారు. రాజమౌళి తన సినిమాకి కథానాయకుడిగా ఎన్టీఆర్ పేరును ప్రకటించగా, హిరాణీ తన సినిమాలో టైటిల్ పాత్రధారిగా అమీర్ ఖాన్ ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే హక్కులు ఎవరి వద్ద ఉన్నాయి? అనేది ఇప్పటికి సస్పెన్స్.
రెండు వారాల క్రితం రాజమౌళి బృందం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ `మేడ్ ఇన్ ఇండియా`ని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. రాజమౌళి వారసుడు కార్తికేయ ఈ చిత్రానికి నిర్మాత. ఇంతలోనే ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీ నుంచి కూడా మరింత క్లారిటీ వచ్చింది. అమీర్ తదుపరి స్పోర్ట్స్ కామెడీ-డ్రామా `సీతారే జమీన్ పర్` విడుదల తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పై ఫోకస్ చేస్తాడని, దానికోసం హిరాణీ పని చేస్తున్నాడని సమాచారం. దీనిని బట్టి లెజెండ్ ఫాల్కేపై ఇద్దరు దిగ్గజ దర్శకులు సినిమాలు తెరకెక్కిస్తుండగా, వీటిలో ఎన్టీఆర్, అమీర్ ఖాన్ లాంటి టాప్ స్టార్లు నటించడం ఉత్కంఠను పెంచుతోంది. అయితే ఒకేసారి ఒకే ప్రముఖునిపై రెండు బయోపిక్‌లు తెరకెక్కితే, అది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. దిగ్గజ దర్శకులు రాజమౌళి, హిరాణీ ఒక అండర్ స్టాండింగ్ తో ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో ఫాల్కేను తెరపై ఆవిష్కరిస్తే బావుంటుందేమో! ఇంతకీ ఫాల్కే జీవితంపై హక్కులు ఎవరి వద్ద ఉన్నాయి? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది.
రణబీర్- అమీర్ లతో పీకే సీక్వెల్
మరోవైపు రాజ్ కుమార్ హిరాణీ తన బ్లాక్ బస్టర్ మూవీ పీకే సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఫాల్కే బయోపిక్ ని పూర్తి చేసాక పీకే సీక్వెల్ పై హిరాణీ పూర్తిగా దృష్టి సారిస్తారని తెలుస్తోంది.
ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. వివాదాలు మోసుకొచ్చినా బాక్సాఫీస్ విజయానికి ఢోఖా లేదు. అమీర్ ఖాన్- పీకే ముగింపులో రణబీర్ కపూర్ సీక్వెల్ గురించి సూచనప్రాయంగా ఎంట్రీ ఇచ్చాడు. PK 2 ఆలోచన ఉందని స్పష్ఠంగా హింట్ ఇచ్చారు. సీక్వెల్ గురించి రాజ్ కుమార్ హిరాణీ, అభిజాత్, ఆమిర్ ఉత్సాహంగా ఉన్నారు. గ్రహాంతరవాసిగా నటించడానికి రణబీర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతడు లవ్ అండ్ వార్, రామాయణం, యానిమల్ పార్క్ చిత్రాలను పూర్తి చేస్తూ, అమీర్ ఖాన్ తో పీకే 2లో జాయిన్ అయ్యే వీలుందని భావిస్తున్నారు.