నెలకు రూ.1.50 లక్షల ఖర్చు.. శ్రీతేజ్ పరిస్థితి ఇంకా అలానే: తండ్రి భాస్కర్

హైదరాబాద్ లోని ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2: ది రూల్ మూవీ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది.;

Update: 2025-12-04 11:28 GMT

హైదరాబాద్ లోని ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2: ది రూల్ మూవీ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప సీక్వెల్ ప్రీమియర్స్ వేయగా.. పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు అభిమానులు, సినీ ప్రియులు విచ్చేశారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగ్గా.. ఓ మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఘటన జరిగిన వెంటనే అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు శ్రీతేజ్. నిష్ణాతులైన వైద్యులు.. కొన్ని నెలల పాటు ఆ బాలుడికి అత్యున్నత ట్రీట్మెంట్ అందించారు. ఆ తర్వాత ఐదు నెలల క్రితం డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు తన ఇంట్లోనే ఉంటున్నాడు శ్రీతేజ్.

కానీ తొక్కిసలాట జరిగి ఏడాదైనా ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పాలి. కళ్ల ముందే తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ నేటికి మంచం మీద నుంచి కదల్లేక పోతున్నాడని అతని తండ్రి భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం సొంతంగా ఆహారం తినలేక, మాట్లాడ లేక ఇబ్బంది పడుతున్నాడని, నేరుగా ఊపిరి కూడా తీసుకోలేక ప్రతిదానికి కృత్రిమ ట్యూబ్ లపైనే ఆధారపడుతున్నాడని సమాచారం.

కదలలేని స్థితిలో ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడని శ్రీతేజ్ తండ్రి ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా తొక్కిసలాట ఘటనలో మెదడులోని కణాలు 70 శాతం దెబ్బతినడంతో అతను పూర్తిగా మాట్లాడలేకపోతున్నాడని తెలిపారు. అయితే తల్లి లేని శ్రీతేజ్ కు తండ్రి భాస్కర్.. అన్నీ తానై చూసుకుంటున్న విషయం తెలిసిందే. అందుకోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలేశారని సమాచారం.

ఘటన జరిగిన నాటి నుంచి కొడుకుకు అన్ని సపర్యలు చేస్తూ.. చికిత్స చేయిస్తున్నారు. అయితే ఇప్పుడు నెలకు శ్రీతేజ్ ట్రీట్మెంట్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. పలు రకాల థెరపీలు, మందులు, డైపర్లు, ఆహారం ఇతర ఖర్చులన్నీ కలిపి నెలకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని భాస్కర్ కన్నీటి పర్యంతమయ్యారు.

హీరో అల్లు అర్జున్ శ్రీతేజ్ పేరుపై ఇప్పటికే డిపాజిట్ చేసిన డబ్బులకు నెల నెల వస్తున్న వడ్డీతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే తొక్కిసలాట జరిగిన సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా ఇప్పటి వరకు కుదుటపడలేదని చెప్పారు. ఇప్పటికీ అలాగే దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News