నన్ను ప్రమోషన్స్ కు పిలవలేదు!
ఈ రోజుల్లో భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడం ఎంత ముఖ్యమైందో అంతే భారీగా సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం కూడా ముఖ్యమైపోయింది;
ఈ రోజుల్లో భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడం ఎంత ముఖ్యమైందో అంతే భారీగా సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం కూడా ముఖ్యమైపోయింది. సినిమాకు సరిగా ప్రమోషన్స్ చేయకపోతే వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. ఆ ఎఫెక్ట్ నేరుగా ఓపెనింగ్స్ మీద పడిపోతుంది. అంతెందుకు ఫ్లాప్ సినిమాను యావరేజ్ గా, యావరేజ్ సినిమాను హిట్ గా, హిట్ సినిమాను బ్లాక్ బస్టర్ గా చేసేంత సత్తా ప్రమోషన్స్ కు ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మేకర్స్ రిలీజ్ కు చాలా ముందు నుంచే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి సినిమాను ఆడియన్స్ వరకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాతలు అందరూ కలిసి కాలేజ్‌లు, ఈవెంట్లు అంటూ పలు చోట్లకు తిరుగుతూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు.
అలా అని అందరూ ప్రమోషన్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే లేదు. నయనతార లాంటి హీరోయిన్లు అయితే ఎన్ని చెప్పినా సినిమా ప్రమోషన్స్ కు మాత్రం రారు. ప్రమోషన్స్ అంటే నా వల్ల కాదంటుంది నయనతార. ఇలాంటి సమయంలో ఓ హీరోయిన్ మాత్రం తనను మూవీ ప్రమోషన్స్ కు పిలవలేదంటోంది.
ఆమె మరెవరో కాదు తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోయిన్ గా మారిన ప్రియాంక, విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ట్యాక్సీవాలా మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్యాక్సీవాలా తర్వాత ప్రియాంక కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా చేసి మరో హిట్ అందుకుంది.
ఇటీవల మ్యాడ్ స్వ్కేర్ సినిమాలో మెరిసిన ప్రియాంక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్లొని ఎస్ఆర్ కల్యాణమండపం ప్రమోషన్స్ లో తాను కనిపించకపోవడానికి కారణాన్ని తెలిపింది. ప్రమోషన్స్ కు ఎవరూ తనను పిలవలేదని, సాంగ్స్, టీజర్ క్లిక్ అయ్యాయి కదా ప్రమోషన్స్ పన్లేదేమో అనుకున్నానని, పిలిస్తే వెళ్లేదాన్ని కానీ పిలవలేదని, ఆఖరికి సినిమాకు హిట్ టాక్ వచ్చాక పిలిచారని, ఇప్పుడు పిలిచినా ఏం లాభమనిపించిందని ప్రియాంక వెల్లడించింది.