ప్రియాంక చోప్రా వల్ల అతడికి తీరని నష్టం..!
``నేను అతడిని ప్రతిరోజూ పోరాడుతుండటం చూస్తున్నాను!`` అని మధు చోప్రా పేర్కొన్నారు. ప్రియాంక సాధించిన భారీ విజయం నీడలో సిద్ధార్థ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడంలో ఎదుర్కొన్న సవాళ్లను ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.;
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి- మహేష్ కాంబినేషన్ మూవీ `వారణాసి`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంకకు సంబంధించిన ప్రతిదీ మీడియా హెడ్ లైన్స్‌లో కొస్తోంది. ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ అన్యోన్య దాంపత్యంతో పాటు, ఆమె సోదరుడు సిద్ధార్థ్, తల్లి మధు చోప్రా గురించిన కథనాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకుని, అటుపై గ్లామర్ రంగంలో కథానాయికగా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ప్రయాణించడంలో, ఆమె ఎదుగుదలలో అడుగడుగునా తల్లి మధు చోప్రా సహకారం అసాధారణమైనది. తన కుమార్తె ఎదుగుదల కోసం మధు చోప్రా ప్రణాళికలు అత్యున్నతమైనవి. అయితే తన కుమార్తె కోసం ఎక్కువ సమయం కేటాయించిన క్రమంలో కుమారుడు సిద్ధార్థ్ చోప్రా ఒంటరివాడయ్యాడని, అతడికి తీరని అన్యాయం జరిగిందని మధు చోప్రా తాజా ఇంటర్వ్యూలో అంగీకరించారు.
మధు చోప్రా తన కుమారుడు సిద్ధార్థ్ చోప్రా గురించి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియాంక కెరీర్ ఆరంభంలో ఆమెను వెన్నంటి ఉండటం వల్ల, సిద్ధార్థ్ బాల్యం, కౌమార దశలో అతడు `కొలేటరల్ డ్యామేజ్` (అనుకోకుండా జరిగిన నష్టం)కు గురయ్యాడని మధు చోప్రా తాజా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రియాంక 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో మధు చోప్రా తన వైద్య వృత్తిని పక్కన పెట్టి, ప్రియాంకకు తోడుగా షూటింగ్‌ల కోసం ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా తన మెడికల్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉండేవారు. తల్లి ప్రియాంకతో ఉండటం, తండ్రి కూడా అందుబాటులో లేకపోవడంతో.. టీనేజ్ వయసులో ఉన్న సిద్ధార్థ్ ఒంటరిగా పెరగాల్సి వచ్చింది. సిద్ధార్థ్ తనంతట తానుగా పెరిగాడు.. అతడిపై తండ్రి ప్రభావం కానీ, నా ప్రభావం కానీ పెద్దగా లేదు! అని మధు చోప్రా భావోద్వేగానికి లోనయ్యారు.
``నేను అతడిని ప్రతిరోజూ పోరాడుతుండటం చూస్తున్నాను!`` అని మధు చోప్రా పేర్కొన్నారు. ప్రియాంక సాధించిన భారీ విజయం నీడలో సిద్ధార్థ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడంలో ఎదుర్కొన్న సవాళ్లను ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. సిద్ధార్థ్ హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ప్రొఫెషనల్ చెఫ్‌గా మారారు. ప్రస్తుతం ప్రియాంక ప్రొడక్షన్ హౌస్ `పర్పుల్ పెబుల్ పిక్చర్స్` కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. సిద్ధార్థ్ చోప్రా గతంలో రెండుసార్లు నిశ్చితార్థాలు రద్దయిన తర్వాత, ఫిబ్రవరి 2025లో నటి నీలం ఉపాధ్యాయను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు కూడా హాజరయ్యారు.
తగినంత సమయం కేటాయించలేక..
మధు చోప్రా ఒక తల్లిగా తన కొడుకుకి తగినంత సమయం కేటాయించలేకపోయాననే పశ్చాత్తాపాన్ని మరోసారి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సిద్ధార్థ్ చోప్రా గతంలో ప్రధానంగా రెండు సందర్భాలు నిశ్చితార్థాల రద్దు కారణంగా తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారు. సిద్ధార్థ్ చోప్రాకు 2014లో కనికా మాథుర్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. 2015 ఫిబ్రవరిలో గోవాలో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లికి కొద్దిరోజుల ముందే రద్దయింది. దీనిపై అప్పట్లో కుటుంబ సభ్యులు స్పందిస్తూ, సిద్ధార్థ్ తన కెరీర్‌పై, తన కొత్త వ్యాపారం పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడని, అందుకే పెళ్లిని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారని తెలిపారు. అయితే ఆ తర్వాత వారు విడిపోయారు.
2019 ఫిబ్రవరిలో ఇషితా కుమార్‌తో సిద్ధార్థ్‌కు అట్టహాసంగా నిశ్చితార్థం జరిగింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లికి ముందే ఇషితాకు ఒక అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. మొదట ఆ కారణంతో పెళ్లి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. కానీ తన కొడుకు పెళ్లికి ఇంకా సిద్ధంగా లేడు... అతడికి కొంత సమయం కావాలని .. పరస్పర అంగీకారంతోనే ఈ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు మధు చోప్రా తెలిపారు. సిద్ధార్థ్ వ్యక్తిగత కారణాలు, కెరీర్ ప్రాధాన్యతల వల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటి నీలం ఉపాధ్యాయను వివాహం చేసుకుని తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.