ఆస్కార్ 2026: ఆ ఐదుగురిలో బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు?
ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో పలు హాలీవుడ్ నటీమణులు తమ అద్భుత నటనతో బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో చోటు దక్కించుకుని అవార్డు కోసం పోటీపడుతున్నారు.;
ప్రపంచ సినీ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వేడుకల్లో ప్రముఖమైనది అకాడమీ అవార్డులు. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును జీవితంలో ఒక్కసారైనా అందుకోవాలని ప్రతి నటుడు, దర్శకుడు, సాంకేతిక నిపుణుడు కలగంటాడు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి ఇప్పుడు 98వ అకాడమీ అవార్డుల వైపు మళ్లింది. ఈ ఏడాది మార్చి 15న అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో పలు హాలీవుడ్ నటీమణులు తమ అద్భుత నటనతో బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో చోటు దక్కించుకుని అవార్డు కోసం పోటీపడుతున్నారు. తమ ప్రతిభావంతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఆస్కార్ గెలుపుకు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచారు. మరి ఈ నేపథ్యంలో అకాడమీ అవార్డు కోసం పోటీ పడుతుందెవరో తెలుసుకుందాం.
98వ ఆస్కార్‌కు నామినేట్ అయిన ప్రముఖ హాలీవుడ్ భామలు:
ఎమ్మా స్టోన్- ఇప్పటికే పూర్ థింగ్స్, లా లా ల్యాండ్ మూవీస్ తో రెండు సార్లు ఆస్కార్ అవార్డులను అందుకున్న ఎమ్మా, ఇప్పుడు బుగోనియా సినిమాకి గానూ ఉత్తమనటిగా నామినేషన్ ను అందుకున్నారు.
రోజ్ బైర్న్- ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐ ఉడ్ కిక్ యు అనే సినిమాలో లిండా పాత్రలో నటించి, ప్రేక్షకుల్ని మెప్పించిన రోజ్.. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ మూవీ ఆమె కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలవగా, ఈ సినిమాతోనే రోజ్ తన తొలి అకాడమీ నామినేషన్ కు ఎంపికయ్యారు.
జెస్సీ బక్లీ- హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన హామ్నెట్ సినిమాలో తన ఎమోషనల్ యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు జెస్సీ. ఈ సినిమాలోని తన నటనకు ఆమె అకాడమీ అవార్డుల్లో నామినేషన్ ను పొందారు.
రెనేట్స్ రీన్స్వే- గతేడాది రిలీజైన సెంటిమెంటల్ వాల్యూ మూవీలో నోరా అనే పాత్రలో నటించి తనదైన యాక్టింగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేసిన రెనేట్స్ ఈ సినిమాలో తన నటనకు గానూ ఈ నామినేషన్ ను దక్కించుకున్నారు. ఈ సినిమా రిలీజైన టైమ్ లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
కేట్ హడ్సన్- క్రెయిగ్ బ్రూవర్ దర్శకత్వం వహించిన అమెరికన్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా సాంగ్ సంగ్ బ్లూ సినిమాలో నటనకు గానూ కేట్ కు ఈ నామినేషన్ దక్కింది.
సినీ విమర్శకులు మరియు అభిమానుల దృష్టి ఇప్పుడు ఈ విభాగంపై ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఈ ఐదుగురు నటీమణులు కూడా తమ తమ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందుకే ఈసారి “బెస్ట్ యాక్ట్రెస్” విభాగంలో పోటీ మరింత కఠినంగా మారింది. ఇప్పటికే అవార్డుల సీజన్‌లో పలువురు క్రిటిక్స్ అవార్డులు, ఫెస్టివల్ ప్రశంసలు అందుకున్న ఈ నటీమణుల్లో చివరకు ఎవరు ఆస్కార్ గెలుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ సినీ ప్రియులంతా ఇప్పుడు అదే ఫలితాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.