లేడీస్ లో నెక్స్ట్ స్పై ఈవిడేనా?
గతంలో యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాతో కంగనాకు ఉన్న విభేదాల దృష్ట్యా, వీరిద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేయడం అనేది అసాధ్యమని అంతా భావించారు.;
యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఐదారుగురు స్టార్ హీరోలతో స్పై సినిమాలు నిర్మించి సంచలన విజయాలు నమోదు చేసింది. `ఆల్పా` తో లేడీ సూపర్ స్టార్లతో సైతం ఓ ప్రయోగం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలియాభట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం త్వర లోనే ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో యశ్ రాజ్ ఫిలింస్ స్పై జానర్లోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా చేరుతుందనే వార్త వెలుగులోకి వచ్చింది. గతంలో యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాతో కంగనాకు ఉన్న విభేదాల దృష్ట్యా, వీరిద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేయడం అనేది అసాధ్యమని అంతా భావించారు.
కానీ కంగనాలోని అద్భుతమైన నటన, ఆమెకున్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆదిత్య చోప్రా ఒక భారీ స్పై థ్రిల్లర్‌ను ఆమె కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో కంగనా రనౌత్ అత్యంత శక్తివంతమైన రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కేవలం గూఢచారి కథ మాత్రమే కాకుండా, దేశభక్తి , అంతర్జాతీయ కుట్రల నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గత కొంత కాలంగా కంగన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించని సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైఆర్ఎఫ్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ మద్దతు ఆమెకు మళ్ళీ పూర్వవైభవం తెచ్చిపెడుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నటన ,యాక్షన్ స్టంట్స్ ఆమె కెరీర్ లోనే అత్యంత ఖరీదైనవిగా ఉండబోతున్నాయి. కంగనాతో పాటు స్పై యూనివర్స్‌లోని ఇతర నటులు కూడా కనిపిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. దీపికా పదుకోన్ , కత్రినా కైఫ్ వంటి ఇతర స్పై పాత్రలతో కంగనా పాత్రకు ఏదైనా కనెక్షన్ ఉంటుందా అనే కోణంలో కూడా కథను రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఈ సినిమా కేవలం సోలో మూవీగా కాకుండా, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లోని ప్రధాన కథాంశంతో ముడిపడి ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయని 2026 ముగింపులో ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈసినిమాను బాలీవుడ్ మేకర్ తో కాకుండా? కోలీవుడ్ స్పై సంచలనం మిత్రన్ ని రంగంలోకి దించుతున్నారని తెలిసింది. కోలీవుడ్ స్పై సినిమాలకు మిత్రన్ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అతడి పని కేవలం దర్శకుడిగానే. స్టోరీకి సంబంధించి వ్యవహారమంతా యశ్ రాజ్ ఫిలింస్ చూసుకుంటుందని సమాచారం.