కుక్కలతో పోల్చలేదు..లారెన్స్ వ్యాఖ్యలపై వివరణ!
రాఘవ లారెన్స్ తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' పార్టీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎంత పెద్ద చర్చకు దారి తీసాయో తెలిసిందే.
రాఘవ లారెన్స్ తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' పార్టీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎంత పెద్ద చర్చకు దారి తీసాయో తెలిసిందే. ఈనేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి ప్రజల కోసం పని చేయడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగానే లారెన్స్ ఓ ఆసక్తికర ఉదాహరణను ప్రస్తావించారు. 'మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు మొదట్లో అక్కడి వాతావరణం గురించి వెంటనే అవగాహన రాదన్నారు. ఇంట్లోని పైపులు లేదా ఫ్యాన్లలో ఉండే సమస్యలు నెమ్మదిగానే తెలుస్తాయని చెప్పారు.
అలాగే ఆ వీధిలోని కుక్కలు కూడా మొదట్లో మనల్ని చూసి మొరుగుతాయని.. వాటికి బిస్కట్లు లేదా బిర్యానీ వేసి అలవాటు చేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. ఒక చిన్న ఇల్లు.. వీధి పరిస్థితే అలా ఉంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యతను కొత్తగా చేపట్టినప్పుడు వారికి మరింత సమయం ఇవ్వడం కనీస బాధ్యత అని లారెన్స్ అభిప్రాయపడ్డారు. అవగాహన లోపమో లేక ఉద్దేశపూర్వకమో కానీ ఈ సుదీర్ఘమైన ప్రసంగంలో నుంచి కుక్కల ప్రస్తావన ఉన్న చిన్న క్లిప్‌లను మాత్రమే కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
దాంతో లారెన్స్ ప్రజలను వీధి కుక్కలతో పోల్చారనే ప్రచారం జోరందుకుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పౌరుల హక్కు అని.. దానిని మొరగడంతో పోల్చడం అధికార అహంకారానికి నిదర్శనమని కొందరు నెటిజన్లు లారెన్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ అపార్థం సామాజిక మాధ్యమాలలో పెద్ద వివాదానికి కారణమైంది. వ్యతిరేకత - విమర్శల నేపథ్యంలో రాఘవ లారెన్స్ వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వివరణాత్మక వీడియోను విడుదల చేశారు. తానేమీ హృదయం లేని వ్యక్తిని కాదని.. తన అభిమానులను.. సామాన్య ప్రజలను ఎల్లప్పుడూ తన తల్లితో సమానంగా గౌరవిస్తానని స్పష్టం చేశారు.
తన మాటలను కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటల వెనుక అసలు ఉద్దేశాన్ని లారెన్స్ మళ్లీ వివరించారు. ఒక కొత్త వాతావరణాన్ని లేదా వ్యవస్థను అర్థం చేసుకోవడానికి దానికి అలవాటు పడటానికి ఎవరికైనా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే తాను ఆ ఉదాహరణ చెప్పానని పదే పదే నొక్కి చెప్పారు. అంతేతప్ప ఎక్కడా ప్రజలను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, దయచేసి ఎడిట్ చేసిన క్లిప్‌లను కాకుండా పూర్తి వీడియోను చూసి నిజాన్ని గ్రహించాలని ప్రజలను కోరారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో పూర్తి సందర్భాన్ని విస్మరించి కొన్ని ముక్కలను మాత్రమే హైలైట్ చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో? ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. వివాదాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం లారెన్స్ 'కాంచన 4' చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే.. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన 'బెంజ్' అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.