'పెద్ది' నిర్మాత లెక్కలు.. మరి ఇంకెంత రాబట్టాలి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన పెద్ది సినిమా సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వేళ.. ఆ మూవీ బడ్జెట్, వసూళ్లు, రెమ్యూనరేషన్లపై కొత్త చర్చ మొదలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన పెద్ది సినిమా సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వేళ.. ఆ మూవీ బడ్జెట్, వసూళ్లు, రెమ్యూనరేషన్లపై కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం నిజంగా ఎంత రాబడితే పూర్తి స్థాయి సక్సెస్ గా నిలుస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
విజయవాడలో నిర్వహించిన పెద్ది మూవీ సక్సెస్ మీట్ లో రీసెంట్ గా ప్రొడ్యూసర్ వెంకట సతీశ్ కిలారు సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలపై జరుగుతున్న విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్లకే వెళ్తుందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
రూ.350 కోట్ల మొత్తం బడ్జెట్‌లో దాదాపు 60 శాతం అంటే సుమారు రూ.210 కోట్లు సినిమా నిర్మాణానికే ఖర్చు చేసినట్లు చెప్పారు. భారీ సెట్లు, విజువల్ గ్రాండియర్, లొకేషన్స్, మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. మిగిలిన 40 శాతం అంటే దాదాపు రూ.140 కోట్లు మాత్రమే క్యాస్టింగ్, దర్శకుడు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్లకు కేటాయించినట్లు వివరించారు.
"రెమ్యూనరేషన్ల వల్ల బడ్జెట్లు పెరుగుతున్నాయని అనడం పూర్తిగా తప్పు. మంచి కథను వరల్డ్ రేంజ్ లో ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టాల్సిందే. తెలుగు సినిమాను పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం" అని నిర్మాత స్పష్టం చేశారు. అయితే రూ.350 కోట్ల బడ్జెట్ అంటే సినిమా అంతే మొత్తం థియేటర్ల నుంచి వసూలు చేయాలనే లెక్క కాదు.
థియేట్రికల్ విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్, ఆడియో వంటి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలకు రికవరీ జరుగుతుంది. అందుకే సినిమా విజయాన్ని నిర్ణయించేది ప్రధానంగా థియేట్రికల్ బిజినెస్ ఆధారంగా ఉంటుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.218.50 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది.
అంటే డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోకుండా ఉండాలంటే దాదాపు రూ.220 కోట్ల షేర్ వసూళ్లు రావాలి. సాధారణంగా ఆ రేంజ్ షేర్ రావాలంటే సుమారు రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అవసరమవుతాయి. ఇప్పటికే పెద్ది 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆదివారం ఒక్కరోజే రూ.15 కోట్ల గ్రాస్ రాబట్టిన ఆ సినిమా.. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రతిష్ఠాత్మక రూ.400 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే థియేట్రికల్ పరంగా ఆ సినిమా క్లీన్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు వెళ్తున్నట్లే అవుతుంది. అయితే నిర్మాత సతీష్ కిలారు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సినిమా దూసుకుపోతుందని చెప్పారు. కానీ ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాలేదని తెలిపారు. అంతే కాదు.. నార్త్ లో పెద్ది మాత్రం ఆడియన్స్ పట్టుకోవాల్సిన సినిమానే అని, కానీ అలా జరగలేదని ఓపెన్ గానే మాట్లాడారు.