దురంధర్-2 నేర్పిస్తున్న పాఠం
ఐతే ‘దురంధర్-2’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే.. ఈ ఆలోచన ఎంత మేలు చేకూరుస్తుందన్నది అర్థమవుతుంది.;
కొత్త సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ వీలైనంత త్వరగా ఓపెన్ చేయడం ఎంత కీలకమో ఎప్పటికప్పుడు అర్థం అవుతున్నా.. సరైన ప్లానింగ్ ఉండదు మన నిర్మాతలకు. కొన్నేళ్ల నుంచి పెద్ద సినిమాలకు అదనపు రేట్లు, షోలకు అవకాశం దక్కుతుండగా.. ఇందుకోసం జీవోలు తెచ్చుకోవడం పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీని కోసమే చాలా రోజులు వృథా అయిపోతున్నాయి. రిలీజ్‌కు రెండు మూడు రోజుల కానీ జీవోలు రావట్లేదు. కొన్ని సినిమాలకు రిలీజ్ ముందు రోజే ఆ పని పూర్తవుతోంది. ఆ తర్వాత బుకింగ్స్ మొదలుపెట్టేసరికి పుణ్యకాలం గడిచిపోతోంది. సంక్రాంతికి ‘రాజాసాబ్’ రిలీజ్ ముంగిట హడావుడి ఎంత నష్టం చేసిందో తెలిసిందే. దీని బదులు అసలు అదనపు రేట్ల జోలికే వెళ్లకుండా.. విడుదలకు వారం పది రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసుకుంటే.. ఎక్కువ టికెట్లు తెగి ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. కానీ నిర్మాతలు పట్టించుకోవడం లేదు.
ఐతే ‘దురంధర్-2’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే.. ఈ ఆలోచన ఎంత మేలు చేకూరుస్తుందన్నది అర్థమవుతుంది. విడుదలకు 12 రోజుల ముందు ట్రైలర్ లాంచ్ చేయడంతో పాటే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టింది టీం. ముందు రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్నాయి. దేశవ్యాప్తంగా నార్మల్ రేట్లతోనే ప్రిమియర్స్ చూసే అవకాశం కల్పిస్తున్నారు మేకర్స్. దీంతో జనం ఎగబడి టికెట్లు కొంటున్నారు. దక్షిణాదిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మేజర్ సిటీస్‌లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగిపోతున్నాయి.
ఇక్కడి స్టార్ల సినిమాల రేంజిలో టికెట్లు తెగుతున్నాయి. చాలా ముందుగా బుకింగ్స్ మొదలుపెట్టడం, నార్మల్ రేట్లు ఉండడం.. అన్నింటికీ మించి సినిమాపై భారీ అంచనాలుండడం వల్ల బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. మన స్టార్ల సినిమాలకు కూడా ఇలా నార్మల్ రేట్లతో చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే.. ఫుట్ ఫాల్స్ పెంచుకోవడం ద్వారా అదనపు రేట్లతో వచ్చే ఆదాయాన్ని మించి కలెక్షన్లు వచ్చే అవకాశముంది. ఈ దిశగా ఫిలిం మేకర్స్ ఆలోచించడం మంచిది.