రెండు భాగాల 'వారణాసి': జక్కన్న టార్చర్ మహేష్‌కి తప్పడం లేదు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న అడ్వెంచర్ యాక్షన్ డ్రామా `వారణాసి` ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న అడ్వెంచర్ యాక్షన్ డ్రామా `వారణాసి` ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకూమారన్ ప్రతినాయకుడిగా (విలన్) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్విరాజ్ ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో రాజమౌళి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో వివరిస్తూ.. ఆయన అంకితభావాన్ని ఆకాశానికెత్తేశారు. తన కెరీర్‌లో రాజమౌళి అంత కష్టపడే దర్శకుడిని తాను ఎక్కడా చూడలేదని ప్రశంసించారు.
హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో పృథ్విరాజ్ సుకూమారన్ మాట్లాడుతూ.. రాజమౌళి సెట్స్‌లో నిమిషాల సమయాన్ని కూడా వృధా చేయరని... మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని నవ్వుతూ చెప్పారు. తన మొదటి సినిమా చేస్తున్న కొత్త దర్శకుడిలాగా రాజమౌళిలో ఎప్పుడూ అదే ఉత్సాహం, తపన కనిపిస్తాయని అన్నారు. షూటింగ్ రోజున సెట్‌లోకి అందరికంటే ముందుగా అడుగుపెట్టేది... అందరూ వెళ్ళిపోయాక చివర్లో బయటకు వచ్చేది రాజమౌళి అని వెల్లడించారు. తానే స్వయంగా అంత శ్రమిస్తూ.. నటీనటులు కూడా అదే క్రమశిక్షణతో షెడ్యూల్స్ టైమింగ్ పాటించాలని జక్కన్న కోరుకుంటారని పృథ్విరాజ్ పేర్కొన్నారు.
ఈ ఇంటర్వ్యూలోనే పృథ్విరాజ్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. సినిమాపై రాజమౌళికి ఉన్న పర్ఫెక్షన్ ఎలాంటిదో చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ.. ఒకరోజు ఉదయం నుంచి రాత్రి దాకా కేవలం ఒక్క సీన్ కోసమే ఏకంగా 90 టేకులు తీసుకున్నారని వెల్లడించడం షాకిస్తోంది. హీరో మహేష్ బాబుపై చిత్రీకరించిన ఆ సీన్ బాగానే వస్తున్నా.. రాజమౌళి పూర్తిగా సంతృప్తి చెందలేదు.. ఆయన అనుకున్న స్థాయి పర్ఫెక్షన్ రాకపోవడంతో ఆ రోజుకి షూటింగ్ ప్యాకప్ చెప్పేశారట. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ సమయంలో కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.... బాహుబలి చిత్రీకరణ సమయంలో ప్రభాస్ - రానాలు సైతం జక్కన్న తన స్క్రీన్‌పై పర్ఫెక్షన్ కోసం ఆర్టిస్టులను ఎంతగా సతాయిస్తారో, ఎంతటి పనిరాక్షసుడో చెప్పిన మాటలు ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఐదేళ్ల పాటు బాహుబలి స్టార్లను, మూడేళ్ల పాటు ఆర్.ఆర్.ఆర్ స్టార్లను జక్కన్న ఉలివేసి హింసించిన సంగతిని మర్చిపోలేరు.
ఈ ప్రచారంలో వాస్తవం ఎంత?
బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం భారీ యాక్షన్ అడ్వెంచర్ `వారణాసి` చిత్రం రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కథా విస్తృతి చాలా పెద్దదిగా ఉండటంతో.. మూడు గంటల వ్యవధిలో పూర్తి కథను చూపించడం సాధ్యం కాదని చిత్ర బృందం భావిస్తోందని ఇదివరకే గుసగుసలు వినిపించాయి. గతంలో `బాహుబలి` చిత్రంతో భారతీయ సినిమా గమనాన్ని మార్చి.. మల్టీ-పార్ట్ ట్రెండ్‌కు తెరలేపిన రాజమౌళి.. ఇప్పుడు `వారణాసి`ని కూడా రెండు భాగాలుగా మలచాలని యోచిస్తున్నారు. ఈ పొడిగించిన ఫార్మాట్ వల్ల సమయం గురించి ఆందోళన లేకుండా... కథను మరింత లోతుగా...విపులంగా చెప్పడానికి వీలవుతుందని సమాచారం. అయితే దీనిపై రాజమౌళి టీమ్ అధికారికంగా ప్రతిదీ చెప్పాల్సి ఉంటుంది. అప్పటివరకూ అభిమానులకు దీనిని కన్ఫామ్ చేయలేని పరిస్థితి ఉంది.
ఈ భారీ సినిమా కథాంశం పవిత్ర నగరమైన `వారణాసి` నేపథ్యంలో సాగినా... షూటింగ్ మాత్రం అక్కడ జరగడం లేదు. దానికి బదులుగా హైదరాబాద్‌లోనే వారణాసి నగరానికి సంబంధించిన అత్యంత భారీతనంతో అద్భుతమైన సెట్స్‌ను మేకర్స్ పునర్నిర్మించి చిత్రీకరించారు. ఇందులో ప్రసిద్ధ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయ నమూనాను కూడా అచ్చం అలాగే ప్రతిబింబించేలా సృష్టించడం విశేషం. గతం (పాస్ట్) నేపథ్యంలో సాగే సన్నివేశాల కోసం పూర్తి స్థాయి ఆలయాన్ని నిర్మించారని... ఆ తర్వాత ప్రస్తుత టైమ్‌లైన్ (ప్రెజెంట్) సన్నివేశాలను చూపించడం కోసం అదే ఆలయాన్ని నీటి అడుగున మునిగిపోయినట్లుగా చిత్రీకరించారని కథనాలొచ్చాయి. విభిన్న కాలాదులలో సన్నివేశాలతో కూడుకున్న ఈ విజువల్ వండర్ మూవీ... ఇంతటి భారీ వ్యయంతో.. సరికొత్త కాంబినేషన్ క్రేజ్‌తో .. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.