ప్రభాస్ మళ్లీనా?... తప్పేముంది?

భారీ అంచనాలతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. టీజర్, ట్రైలర్ నుంచి రిలీజ్ వరకు హైప్ పెరిగిపోతుంది.;

Update: 2026-02-22 19:30 GMT

భారీ అంచనాలతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. టీజర్, ట్రైలర్ నుంచి రిలీజ్ వరకు హైప్ పెరిగిపోతుంది. అయితే ఆ అంచనాలకు సరిపడా కంటెంట్ లేకపోతే ఫలితం మాత్రం ఎవరూ ఊహించలేం. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ విషయంలో అదే జరిగింది.

హారర్ థ్రిల్లర్ జోనర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్టోరీ, స్క్రిప్టింగ్, టెక్నికల్ ఎలిమెంట్స్ కు మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా ప్రభావం పడింది. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దర్శకుడు మారుతి, నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విమర్శలు వినిపించాయి.

అయితే సినీ ఇండస్ట్రీలో సక్సెస్లు, ఫ్లాప్లు సహజమే. ఎంత పెద్ద బ్యానర్ అయినా, ఎంత స్టార్ హీరో అయినా ప్రతి సినిమా హిట్ అవుతుందనే గ్యారంటీ ఉండదు. మంచి ఉద్దేశంతో తీసిన ప్రాజెక్ట్ కూడా కొన్నిసార్లు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కావాలనే ఎవరూ ఫ్లాప్ సినిమా తీయరు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన నిజం. ఇలాంటి సమయంలో ప్రభాస్ మళ్లీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ తో పని చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిర్మాత విశ్వప్రసాద్ తో మరో ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కొందరు గత సినిమా రాజా సాబ్ రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అవసరమా అంటున్నా, మరికొందరు మాత్రం దీనిని పాజిటివ్‌ గా చూస్తున్నారు. ఎందుకంటే ఒకసారి కలిసి పనిచేసిన టీమ్ మళ్లీ కలిసి వస్తే గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు.

సరైన కథ, స్ట్రాంగ్ స్క్రీన్‌ ప్లే, రిచ్ టెక్నికల్ వాల్యూస్ ఉంటే అదే కాంబినేషన్ సూపర్ హిట్ కూడా ఇవ్వగలదు. ప్రభాస్ కెరీర్‌ ను పరిశీలిస్తే ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడరు. కొత్త కొత్త దర్శకులు, కొత్త కథలతో ముందుకు రావడం ఆయన స్పెషాలిటీ. ఒక సినిమా ఫలితం చూసి రిలేషన్స్ తెంచుకోవడం కంటే మరోసారి ప్రయత్నించడం కూడా ప్రొఫెషనలిజం భాగమే అని అంతా చెబుతున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై మరో మూవీ ఎప్పుడు చేయనున్నారన్నది ఆసక్తికరం. ఏదేమైనా ఒక్క సినిమా రిజల్ట్ తో ఏ కాంబినేషన్‌ ను తక్కువగా అంచనా వేయడం సరికాదు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ బ్యానర్ అయినా, ఎలాంటి కాంబో అయినా సక్సెస్ సాధించగలదు. మరి పీపుల్ సంస్థతో నిజంగా ప్రభాస్ మరో మూవీ ఉంటుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News