హైకోర్టుకు పవన్.. సేమ్ అదే సమస్యతో..

టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.;

Update: 2025-12-12 08:09 GMT

టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు, అవమానకరమైన పోస్టులు, మోసపూరిత వీడియోలు ప్రచారం అవుతూ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ తరఫున న్యాయవాది.. హైకోర్టులో పిటిషన్ వేశారు. సోషల్ మీడియా వేదికలు, కొన్ని ఇ-కామర్స్ సైట్లు, ఇతర ఆన్‌ లైన్ ఛానెళ్లలో ఆయనను లక్ష్యం చేసుకొని పలు తప్పుదారి పట్టించే, అవమానకరమైన, వ్యక్తిగత గోప్యత దెబ్బతీసే విధమైన పోస్టులు వైరల్ అవుతున్నాయని పిటిషన్‌ లో పవన్ తరఫు న్యాయవాది చెప్పారు.

అవి కేవలం వ్యక్తిగత ప్రతిష్ఠకే కాదు, ఒక ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలపై కూడా ప్రభావం చూపుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పవన్ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన వ్యక్తిగత హక్కులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడం అవసరం ఉందని శుక్రవారం వ్యాఖ్యానించింది.

సోషల్ మీడియా ప్లాట్‌ ఫార్మ్‌ లు, అనుబంధ వెబ్‌ సైట్లలో ప్రచారం అవుతున్న లింకులన్నింటినీ వారం లోపు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. తొలగించాలనుకుంటున్న URLలు, వీడియోలు, పోస్టుల వివరాల జాబితాను తమకు అందించాలని తెలిపింది. అందుకు గాను పవన్ తరఫున న్యాయవాదికి కోర్టు 48 గంటల గడువు ఇచ్చింది.

అనంతరం కేసు పై మరిన్ని వాదనలు వినిపించేందుకు డిసెంబర్ 22 తేదీకి విచారణను వాయిదా వేసింది. అయితే గతంలో ఇదే తరహా సమస్యతో పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అందులో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉండగా.. ఇప్పుడు పవన్ కూడా చేరారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిటిషన్‌ కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత పెంపు దిశగా మరో కీలక అడుగు అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 22న జరిగే తదుపరి విచారణలో ఏ విధమైన మార్గదర్శకాలు వెలువడతాయో అన్న విషయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి ఆ రోజు.. దిల్లీ హైకోర్టు.. పవన్ కళ్యాణ్ పిటిషన్ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు వెలువరిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News