నవీన్ పొలిశెట్టి, మీనాక్షీల పెళ్లి రిసెప్ష‌న్‌!

ఈ సంద‌ర్భంగా మీడియాలోని ప‌లువురు సీనియ‌ర్స్ వారికి గిఫ్ట్‌ల రూపంలో క‌వ‌ర్స్ అందిస్తూ వారికి న‌చ్చిన క్వొశ్చ‌న్స్‌ని సంధించారు.;

Update: 2025-12-31 09:57 GMT

కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌ల‌తో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో న‌వీన్ పొలిశెట్టి, క్రేజీ హీరోయిన్ మీనాక్షీ చౌద‌రి పెళ్లి రిసెప్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. అదేంటీ న‌వీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌద‌రీల పెళ్లి రిసెప్ష‌న్ ఏంటీ?... వాళ్ల‌కు పెళ్లి ఎప్పుడు జ‌రిగింది?.. అనే వార్త ఫ్యాన్స్‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే...సినిమా ప్ర‌చారం కొత్త పుంత‌లు తొక్కుతోంది. తాము నిర్మించిన సినిమాను, దాని కాన్సెప్ట్‌ని ప్రేక్ష‌కుల్లోకి బ‌లంగా తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలో భాగంగా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌ని కొత్త పుంత‌లు తొక్కిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాల‌కు సైతం ప్మోష‌న్స్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న నేప‌థ్యంలో మినిమ‌మ్ బ‌డ్జెట్ సినిమాలు, మినిమ‌మ్ గ్యారెంటీ హీరోలు కూడా త‌మ సినిమాల‌ని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డానికి కొత్త పంథాని అనుస‌రిస్తున్నారు. దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌద‌రి జంట‌గా న‌టించిన మూవీ 'అన‌గ‌న‌గ ఒక రాజు'. మారి ద‌ర్శ‌కుడు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. కొంత విరామం త‌రువాత న‌వీన్ చేసిన సినిమా కావ‌డంతో దీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్ల‌డం కోసం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో హోరెత్తిస్తున్నారు.

ఇందులో భాగంగానే 'అన‌గ‌న‌గ ఒక రాజు పెళ్లి రిసెప్ష‌న్‌' పేరుతో ఓ ఈవెంట్‌ని టీమ్ తాజాగా నిర్వ‌హించింది. కొత్త జంట రిసెప్ష‌న్‌కు సిద్ధ‌మైన‌ట్టుగానే న‌వీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌద‌రి సిద్ధ‌మై వేదిక‌పై కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాలోని ప‌లువురు సీనియ‌ర్స్ వారికి గిఫ్ట్‌ల రూపంలో క‌వ‌ర్స్ అందిస్తూ వారికి న‌చ్చిన క్వొశ్చ‌న్స్‌ని సంధించారు. ఈ సంద‌ర్భంగా న‌వీన్ పొలిశెట్టి త‌న‌దైన మార్కు స‌మాధానాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. మీ పెళ్లికి సంబంధించిన చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిని ఎప్పుడు నిజం చేస్తార‌ని అడిగితే.. ప్రభాస్ ఏ రోజు పెళ్లి చేసుకుంటారో ఆ మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నేను చేసుకుంటా అంటూ చ‌మ‌త్క‌రించాడు.

సంక్రాంతికి మెగాస్టార్‌తో పోటీకి దిగుతున్నారా? అని అడిగిన ప్ర‌శ్న‌కు 'మ‌నం సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా స్టార్‌గా ఎద‌గ‌వ‌చ్చ‌ని చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. ఈ రోజు నాలాగ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారంటే దానికి మెగాస్టారే కార‌ణం. ఆడియ‌న్స్ అంద‌రూ ఆయ‌న న‌టించిన 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు' చూసి మా సినిమాకు వ‌స్తార‌ని అనుకుంటున్నా. నేను ఆయ‌న వీరాభిమాన‌ని' అన్నాడు. అంతే కాకుడా తాను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాలో చెప్పాడు.

ఆ అమ్మాయి త‌న‌ని ప్ర‌శ్న‌లు అడ‌గ‌కూడ‌ద‌ని, త‌ను ఎలా ఉన్నా త‌న కోసం తాను మార‌తాన‌ని చెప్పాడు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ‌ని అడిగితే..నాకు సినిమాల్లో పెళ్లి చేసుకోవాల‌ని రాసిన‌ట్టుంది. మీరు ఇలానే ఆద‌రిస్తూ ఉంటే నా ప్ర‌తి సినిమాలో పెళ్లి సీన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాన‌న్నాడు. ఇలా ఒక సినిమా కోసం పెళ్లి రిసెప్ష‌న్ కాన్సెప్ట్‌తో ప్ర‌మోష‌న్స్ కోసం ప్ర‌త్యేకంగా ఆవెంట్‌ని నిర్వ‌హించ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న‌వీన్ పొలిశెట్టి మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సాగే `అన‌గ‌న‌గ ఒక రాజు` త‌ను ఆశిస్తున్న‌ట్టే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News