బయోపిక్ కోసం వేల మైళ్ల నుంచి అభిమానులు!

ఈ ప్రీమియర్ వేడుక ప్రత్యేకత ఏంటంటే? అభిమానులు కేవలం స్థానిక ప్రాంతాల నుండే కాకుండా వేల మైళ్ల దూరం ప్రయాణించి చేరుకోవ‌డం.;

Update: 2026-04-11 07:21 GMT

పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ అనే పేరు ఒక ప్రభంజనం. ఆయన మరణించి దశాబ్ద కాలం దాటినా ఆ ప్రభావం ఇసుమంతైనా తగ్గలేదని జర్మనీలోని బెర్లిన్ నగరం సాక్షిగా మరోసారి నిరూపితమైంది. మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మైఖేల్` చిత్ర ప్రపంచ ప్రీమియర్ వేడుక ఇటీవల బెర్లిన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు తరలిరావడంతో బెర్లిన్ వీధులన్నీ మైఖేల్ నామస్మరణతో మారుమోగిపోయాయి. ఈ ప్రీమియర్ వేడుక ప్రత్యేకత ఏంటంటే? అభిమానులు కేవలం స్థానిక ప్రాంతాల నుండే కాకుండా వేల మైళ్ల దూరం ప్రయాణించి చేరుకోవ‌డం.

అమెరికా, జపాన్, బ్రెజిల్ , ఆస్ట్రేలియా వంటి సుదూర దేశాల నుండి అభిమానులు బెర్లిన్‌కు రావడం మైఖేల్ జాక్సన్ పట్ల వారికి ఉన్న అచంచలమైన ప్రేమకు నిదర్శనం. రెడ్ కార్పెట్ వద్ద మైఖేల్ జాక్సన్ ఐకానిక్ డ్రెస్సులు, హ్యాట్లు , గ్లౌజులు ధరించి అభిమానులు సందడి చేస్తూ ఆయన సిగ్నేచర్ స్టెప్స్‌తో ఆ ప్రాంతాన్ని ఒక భారీ సంగీత కచేరీ వేదికలా మార్చేశారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ జాక్సన్ పోషించడం విశేషం. ప్రీమియర్ వేడుకకు జాఫర్ రాగానే అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది.

మైఖేల్ జాక్సన్ రూపురేఖలను, నడకను , చూపును జాఫర్ అద్భుతంగా అనుకరించారని చూస్తుంటే మళ్ళీ మైఖేల్ తిరిగి వచ్చినట్లు అనిపించిందని పలువురు అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఒక లెజెండ్ పాత్రను ఆయన కుటుంబ సభ్యులే పోషించడం ఈ సినిమాకు అతిపెద్ద ఆకర్షణగా మారింది. దర్శకుడు ఆంటోనీ ఫుక్వా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మైఖేల్ జాక్సన్ చిన్నతనం నుండి పాప్ స్టార్‌గా ఎదిగిన క్రమం, ఆయన సాధించిన రికార్డులతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని వివాదాలను కూడా ఈ సినిమాలో స్పృశించినట్లు తెలుస్తోంది.

సినిమా నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం కేవలం మైఖేల్ సంగీత ప్రస్థానాన్ని మాత్రమే కాకుండా ఒక మనిషిగా ఆయన అనుభవించిన ఒత్తిడిని, పోరాటాన్ని కూడా వెండితెరపై ఆవిష్క‌రించారు. ప్రీమియర్ సందర్భంగా మైఖేల్ జాక్సన్ పాత పాటలను ప్లే చేయగా, అభిమానులు భావోద్వేగంతో డాన్సు చేశారు. కాలం మారుతున్నా? సంగీత రీతులు మారుతున్నా ? `కింగ్ ఆఫ్ పాప్` స్థానం ఎప్పటికీ పదిలమని ఈ భారీ స్పందన ద్వారా స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతుల ప్రజలను తన సంగీతంతో ఏకం చేసిన ఘనత మైఖేల్ జాక్సన్‌కే చెందుతుందని వచ్చిన అభిమానులు పేర్కొన్నారు.

ఈ ప్రీమియర్ సాధించిన విజయం, సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోందో ముందే సూచిస్తోంది. 'మైఖేల్' బయోపిక్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. అదొక‌ లెజెండ్‌కు ప్రపంచం అర్పిస్తున్న నివాళి. బెర్లిన్ ప్రీమియర్ వద్ద నెలకొన్న కోలాహలం మైఖేల్ జాక్సన్ వారసత్వం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని చాటిచెప్పింది. జాఫర్ జాక్సన్ ప్రదర్శన సినిమాకు ప్రాణవాయువులా నిలిచిందని చూసిన వారు చెబుతున్నారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం మళ్ళీ మైఖేల్ జాక్సన్ మ్యాజిక్‌ను థియేటర్లలో రీక్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది

Tags:    

Similar News