ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు ఉన్నందుకు సంతోషంగా ఉంది
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.;
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కమల్ హాసన్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సినిమా థగ్ లైఫ్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమాలో శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో నటించగా, ఈ సినిమా జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మణిరత్నం పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. నటీనటులు 8 గంటలు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటామని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ అనేది హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఈ కారణంగానే ఓ పెద్ద సినిమాను వదులుకున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో మణిరత్నం ఆ టాపిక్ పై మాట్లాడారు.
వర్కింగ్ అవర్స్ విషయంలో నటీనటులు చేస్తున్న డిమాండ్ సరైనదే అని తాను భావిస్తున్నానని, ఇంకా చెప్పాలంటే అలా అడిగే పొజిషన్ లో యాక్టర్లు ఉన్నందుకు సంతోషంగా ఉందని, ఓ డైరెక్టర్ గా తాను ఈ విషయాన్ని లెక్కలోకి తీసుకుంటానని, అలా అడగడంలో తప్పు లేదని, అది ఎంతో అవసరమైన విషయమని, దానికి తగ్గ ప్రధాన్యత ఉండాలని, అందరూ దాన్ని అర్థం చేసుకుని ఒప్పుకోవాలని మణిరత్నం అన్నారు.
అదే ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో మణిరత్నం సినిమా చేయబోతున్నాడని వస్తున్న వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. రజనీ- మణిరత్నం కాంబినేషన్ లో అప్పుడెప్పుడో దళపతి సినిమా వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. రజినీకాంత్ మొన్నా మధ్య పొన్నియన్ సెల్వన్2 ఆడియో లాంచ్ కు రావడంతో వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై మణిరత్నం మాట్లాడుతూ ఈ విషయంలో క్లారిటీ కావాలంటే రజినీకాంత్‌నే అడగాలని, లేదంటే వెయిట్ చేయాలని, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. థగ్ లైఫ్ సినిమా తర్వాత చేయడానికి తన దగ్గర నాలుగు గొప్ప స్క్రిప్ట్ లు ఉన్నాయని, కానీ వాటిలో ఏదీ పూర్తిగా రెడీ అవలేదని చెప్పారు. థగ్ లైఫ్ సినిమా రిలీజయ్యాక కొన్నాళ్ల పాటూ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టు ను మొదలుపెట్టనున్నట్టు మణిరత్నం తెలిపారు.