టాలీవుడ్ లో మలయాళం కిక్కు
కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. కండల కంటే కళ్లలో కసిని, నటనలో వైవిధ్యాన్ని చూపించే నటుల వైపు మన దర్శకులు మొగ్గు చూపుతున్నారు.;
తెలుగు సినిమా రేంజ్ పెరిగే కొద్దీ విలన్ల ఎంపికలో కూడా భారీ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మన హీరోలను ఢీకొట్టాలంటే బాలీవుడ్ నుంచి పవర్ఫుల్ బాడీ ఉన్న నటులను దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. కండల కంటే కళ్లలో కసిని, నటనలో వైవిధ్యాన్ని చూపించే నటుల వైపు మన దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఆ అన్వేషణలో వారికి దొరికిన అద్భుతమైన గని 'మలయాళ ఇండస్ట్రీ'. ఇప్పుడు టాలీవుడ్ లో మాలీవుడ్ విలన్ల హవా గట్టిగా నడుస్తోంది.
ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ పాత్ర అంతకంటే బలంగా ఉండాలి. ఇప్పుడు మన పాన్ ఇండియా సినిమాల్లో సరిగ్గా అదే జరుగుతోంది. కేరళలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు సైతం, మన తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేయడానికి సై అంటున్నారు. కేవలం గెస్ట్ రోల్స్ లా కాకుండా, సినిమాను మలుపు తిప్పే క్రూరమైన పాత్రల్లో వారు కనిపిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి' సినిమా కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంచుకోవడం సంచలనం సృష్టించింది. ఇందులో ఆయన 'కుంభా' అనే క్రూరమైన విలన్ గా కనిపించబోతున్నారు. మొదట ఒక వికలాంగుడిలా కనిపించినా, లోపల ఎంతటి రాక్షసుడు దాగి ఉంటాడో తెరపై చూడాల్సిందే. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో మరో మలయాళ హీరో టోవినో థామస్ విలన్ గా చేస్తున్నారనే వార్త అంచనాలను పెంచేసింది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, బజ్ మాత్రం గట్టిగానే ఉంది.
ఇక 'పుష్ప' సినిమాతో ఫహద్ ఫాజిల్ తెలుగులో విలనిజం స్థాయిని ఎలా పెంచారో చూశాం. ఆయన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర పుష్ప 2లో మరింత బాగా క్లిక్కయ్యింది. మరోవైపు షైన్ టామ్ చాకో వరుస పెట్టి తెలుగు సినిమాలు చేస్తున్నాడు. నాని 'దసరా' నుంచి మొదలుపెడితే ఎన్టీఆర్ 'దేవర', బాలయ్య 'డాకు మహారాజ్', నితిన్ 'రాబిన్ హుడ్' వరకు అన్నింట్లోనూ వైవిధ్యమైన విలన్ పాత్రలతో గుర్తింపుని అందుకున్నాడు.
కేరళలో హీరోలుగా సినిమాలు చేస్తూనే, తెలుగులో ఇలా పవర్ ఫుల్ విలన్లుగా మారడం వారి నటనా ప్రతిభకు నిదర్శనం. రొటీన్ అరుపులు, కేకలు కాకుండా.. తమదైన బాడీ లాంగ్వేజ్ తో భయపెట్టే విలన్లుగా వారు మన ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. అందుకే సునీల్ శెట్టి లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా "టాలీవుడ్ ఇప్పుడు కేవలం బాలీవుడ్ వైపే చూడటం లేదు, దేశమంతా వెతుకుతోంది" అని వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఈ 'మాలీవుడ్ విలన్స్' ఎంట్రీతో తెలుగు సినిమా స్క్రీన్ పై కొత్త ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. మన హీరోల మాస్ ఇమేజ్ కు, మలయాళ నటుల రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్ తోడైతే వచ్చే కిక్కే వేరు. రాబోయే రోజుల్లో ఈ లిస్టులో ఇంకెంతమంది మలయాళ స్టార్లు చేరతారో చూడాలి.