మాధురీ దీక్షిత్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన గాయ‌కుడు!

పరిశ్రమలో దశాబ్దాల క్రితం నాటి విషయాలు ఇప్పటికీ ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి.

Update: 2026-06-08 16:51 GMT

పరిశ్రమలో దశాబ్దాల క్రితం నాటి విషయాలు ఇప్పటికీ ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి. బాలీవుడ్‌ను ఏలిన ధక్ ధక్ గర్ల్ మాధురి దీక్షిత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ పాత రూమర్ తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ కొస్తుంది. మాధురీ దీక్షిత్ సినిమాల్లోకి రాకముందు నేపథ్య గాయకుడు సురేష్ వాడ్కర్‌తో పెళ్లి సంబంధం వచ్చిందని ఆ స‌మ‌యంలో మాధురి మరీ సన్నగా ఉందనే కారణంతో ఆయన తిరస్కరించారనే వార్త ప్రచారంలోకి వ‌చ్చింది. ఈ రూమర్‌పై తాజాగా సురేష్ వాడ్కర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

మాధురి దీక్షిత్ కుటుంబం నుండి తనకు ఎలాంటి పెళ్లి ప్రతిపాదన రాలేదన్నారు. మాధురీ సన్నగా ఉందనే కార ణంతో రిజెక్ట్ చేశాననడంలో వాస్తవం లేదన్నారు. ఈ రకమైన రూమర్స్ ఎలా పుడతాయో? అర్థం కావ‌డం లేద‌న్నారు. ఆ రోజుల్లో కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్న మాట వాస్తవమేనని సురేష్ వాడ్కర్ తెలిపారు. ఆ క్రమంలోనే ఎవరో ఒక మధ్యవర్తి ద్వారా ఇరు కుటుంబాలకు తెలిసిన వారు మాధురి దీక్షిత్ పేరును ప్రాథమికంగా ప్రస్తావించి ఉండొచ్చు కానీ అది పెళ్లి చూపుల వరకు వెళ్లలేదన్నారు.

మాటల రూపంలో అనుకున్న ఒక చిన్న విషయాన్ని కాలక్రమేణా పెద్ద కథగా మార్చేసి ప్రచారం చేశారని అభిప్రాయ‌ప‌డ్డారు. మాధురి దీక్షిత్ నటన, అందం .. ఆమె సాధించిన విజయాల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఈ సందర్భంగా సురేష్ వాడ్కర్ కొనియాడారు. మాధురీ భారతీయ సినిమా గర్వించదగ్గ గొప్ప నటి అని.. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి నిరాధారమైన వార్తలు రావడం స‌రికాద‌న్నారు. ఇండస్ట్రీలో ఒకరినొకరు తెలుసనే కారణంతోనో.. సమకాలీనులుగా ఉన్నందున ఇలాంటి గాసిప్స్ సృష్టించడం అప్పట్లో సర్వసాధారణంగా ఉండేదన్నారు.

సినిమా రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి.. వారి పెళ్లిళ్లు .. సంబంధాల గురించి కథనాలు అల్లడం ప‌రిపాటే. ఏదేమైనా? సురేష్ వాడ్కర్ ఇచ్చిన తాజా వివరణతో ఈ ప్ర‌చారానికి శాశ్వ‌తంగా పుల్ స్టాప్ ప‌డిన‌ట్లే. కాలం గడిచేకొద్దీ నటీనటులు .. గాయకుల వృత్తిపరమైన విజయాల కంటే వ్యక్తిగత జీవితాల చుట్టూ అల్లిన కథలకే ఎక్కువ ప్రచారం లభిస్తుంటుంది అనడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. మాధురి దీక్షిత్ డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకుని స్థిర‌ప‌డ్డారు. సురేష్ వాడ్కర్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిం చుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News