నటి మరణం వెనక వేధింపులు.. దర్యాప్తుకు CM ఆదేశించాలి!
కుంకుమ్ భాగ్య ఫేం, నటి సంచిత ఉంగాలే హఠాన్మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కుంకుమ్ భాగ్య ఫేం, నటి సంచిత ఉంగాలే హఠాన్మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 26 ఏళ్ల వయసులో నటి ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడటం పరిశ్రమ వర్గాల్లో కలకలం రేపింది. కుంకుమ్ భాగ్య, వాగ్లే కీ దునియా, సైలెన్స్: ది నైట్ అవుల్ బార్ షూటౌట్ వంటి పాపులర్ సీరియల్స్, సినిమాలతో పాటు ఇటీవల విడుదలైన `చావా` చిత్రంలోనూ నటించి సంచిత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటి ఇలా కెరీర్ ఆరంభంలోనే తనువు చాలించడం ఆమె కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.
సంచిత మరణంపై ఆమె సోదరుడు ఆకాష్ చేసిన ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారాయి. సినిమా పరిశ్రమలో ఎదురైన కాస్టింగ్ వేధింపులే తన సోదరి ఆత్మహత్యకు కారణమని ఆయన ఆరోపించారు. కొందరు వ్యక్తులు సంచితను మానసికంగా తీవ్రంగా వేధించారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఈ విపరీత నిర్ణయం తీసుకుందని ఆవేదన చెందారు. గతంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎదుర్కొన్న వేధింపుల తరహాలోనే, సంచిత కూడా పరిశ్రమలోని ఒత్తిళ్లకు , వేధింపులకు బలైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సంచిత ఉంగాలే మరణంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసిడబ్ల్యూఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అసోసియేషన్ లేఖ రాసింది. ఈ కేసును అత్యంత పారదర్శకంగా, లోతుగా విచారించాలని కోరింది. సంచిత ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో `దఫిలీ వాలే దఫ్లీ బజా` అనే పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారని... ఈ అంశంతో పాటు అన్ని కోణాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.
సినీ పరిశ్రమలో ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న కళాకారుల మరణాలపై ఏఐసిడబ్ల్యూఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత కొన్ని ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల వెనుక కుటుంబ సభ్యులు, సహచరుల్లో రేకెత్తుతున్న అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేకుండా మిగిలిపోయాయని గుర్తు చేసింది. నటీనటులు, సినీ కార్మికుల భద్రత, మానసిక ఆరోగ్యం ... వారికి అందుబాటులో ఉన్న సహాయక వ్యవస్థలపై తక్షణమే సమీక్ష జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసోసియేషన్ అభిప్రాయపడింది.
పరిశ్రమలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, ఇలాంటి విషాద సంఘటనలపై అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐసిడబ్ల్యూఏ కోరింది. సంచిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని ప్రకటించింది. ఎంతో ప్రతిభావంతురాలైన యువ నటిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, ఆమె కుటుంబ సభ్యులకు అసోసియేషన్ తన తీవ్ర సెంతాపాన్ని తెలియజేసింది.