వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడానికి కారణం?
`గమ్యం` చిత్రంతో కెరీర్ ప్రారంభించి డజను పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు క్రిష్.;
'గమ్యం' చిత్రంతో కెరీర్ ప్రారంభించి డజను పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు క్రిష్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా `హరి హర వీరమల్లు` చిత్రానికి ఆయన దర్శకుడు. కానీ కరోనా క్రైసిస్ కాలంలో ఈ సినిమా చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమైంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి అకస్మాత్తుగా క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) వైదొలగడానికి కారణాలేమిటో ఎవరికీ అంత స్పష్ఠంగా తెలీదు. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఘాటి సినిమాని రిలీజ్ చేసేందుకు క్రిష్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో `...వీరమల్లు` నుంచి తాను తప్పుకోవడానికి కారణమేమిటో స్పష్టంగా చెప్పారు క్రిష్. తన వ్యక్తిగత కారణాల వల్లనే మూవీ నుంచి తప్పుకున్నానని తెలిపారు.
క్రిష్ మాట్లాడుతూ ఇలా అన్నారు. ''ప్రతి సినిమా ఒక జర్నీ.. హరి హర వీరమల్లు చిత్రం కొంత భాగాన్ని నేను చిత్రీకరించాను. నాకు పవన్ కల్యాణ్ గారు అంటే నాకు ప్రేమ.. ఇష్టం.. ఏం రత్నం గారు అంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్ చూసి స్ఫూర్తి పొందాను. ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నాను. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల.. మధ్యలో కోవిడ్ 19 వల్ల కూడా నేను పక్కకు రావాల్సి వచ్చింది. నా వ్యక్తిగత కారణాల వల్లనే హరిహర వీరమల్లు నుండి బయటకు వచ్చేశాను. ఆ జర్నీ నా పరంగా పూర్తయింది. మిగిలిన జర్నీని మరొక దర్శకులు జ్యోతి కృష్ణ గారు పూర్తి చేసారు. ఆ తర్వాత నేను పూర్తిగా `ఘాటి` మూవీ పనిలో ఉన్నాను'' అని తెలిపారు.
క్రిష్ తెరకెక్కించిన `ఘాటి` యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం. దీనిని యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై యెదుగురు రాజీవ్ రెడ్డి- సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. విక్రమ్ ప్రభు, చైతన్య రావు మదాడి, జగపతి బాబు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 5 సెప్టెంబర్ 2025న విడుదల కానుంది.