బ్యాంక్ + నాటకాలు + సినిమా + పాలిటిక్స్: కోటా కలర్ఫుల్ జర్నీ!

కోటా శ్రీనివాసరావు సినీ రంగప్రవేశానికి ముందు భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు. అప్పట్లో సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదు.;

Update: 2025-07-13 05:07 GMT

ఓ బ్యాంక్ ఉద్యోగి నుంచి వెండితెర విలన్ దాకా...

కోటా శ్రీనివాసరావు సినీ రంగప్రవేశానికి ముందు భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు. అప్పట్లో సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదు. కానీ నాటకాలపై ఉన్న మక్కువ, తండ్రి కోటా సీతారామాంజనేయులుగా ప్రజలకు సేవ చేయాలనే ఆశయం చివరకు నటన రూపంలో వెలిసింది. 1977లో చేసిన 'ప్రాణం ఖరీదు' అనే నాటకం అతని జీవితాన్ని మార్చేసింది. అదే సినిమాగా మారి 1978లో కోటా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి కూడా ఆ సినిమా ద్వారానే పరిచయమయ్యారు.

కేవలం నటుడే కాదు, విలనిజానికి కొత్త నిర్వచనం

విలన్ పాత్రలకు కొత్త అర్థం చెప్పిన వ్యక్తిగా కోటా గుర్తింపు పొందారు. ప్రతిఘటన, వందేమాతరం సినిమాల్లో ఆయన చూపిన క్రూరత్వం ప్రేక్షకులను అసహ్యించుకునేలా చేసింది. ముఖ్యంగా మంత్రి కాశయ్య పాత్రలో ఆయన తెలంగాణ యాసతో ప్రదర్శించిన చలనం, రాజకీయ అవినీతిపై చూపిన విమర్శ ఆయన నటనలోనే కనిపించింది. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన ఆయన కెరీర్, ఈ సినిమాతోనే బిగ్ బ్రేక్ దక్కింది.

కామెడీతోనూ అలరించిన నట విశ్వరూపం

కోటా పాత్రలు కేవలం విలన్ కోణంలోనే కాదు, కామెడీ జోనర్‌లోనూ ఒక ట్రెండ్ సెట్ చేశారు. బాబూ మోహన్‌తో కలిసి చేసిన సినిమాలు తెలుగువారికి ఆల్ టైమ్ పేవరేట్. వీరి మధ్య కెమిస్ట్రీ, టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలిచింది. 'అహనా పెళ్లంట', 'మామగారు', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి సినిమాల్లో పిసినారి పాత్రలు పోషిస్తూ నవ్వులు పూయించారు.

750 సినిమాలు.. కానీ సినిమాలంటే ఇష్టం తక్కువే!

కోటా ఒక ఇంటర్వ్యూలో "నాకు సినిమాలంటే అంతగా ఆసక్తి ఉండదు.. నాటకాలంటేనే ఇష్టం ఎక్కువ" అని చెప్పడం విశేషం. అయినా కూడా జీవితంలోని పాఠాలను నటన ద్వారా పలికిస్తూ 750కి పైగా చిత్రాల్లో నటించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. సినిమా అంటే అభిమానం కాకపోయినా, నటనంటే ప్యాషన్ ఉండటం వల్లే ఈ స్థాయికి ఎదిగారు.

రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన నటుడు

సినిమాల్ని మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు కోటా. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 2004 తరువాత మళ్ళీ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ఇక రాజకీయాల్లోనూ ఆయన స్పష్టత, నిబద్ధత కనిపించేది. అయినా ఆయన అసలు జీవితం వెండితెరపైనే పరిపూర్ణమైంది.

ఎస్వీ రంగారావు, రావు గోపాలరావు.. ఆ తరువాత కోటా

తెలుగు సినిమాల్లో కొద్దిమంది నటులే ప్రత్యేక గుర్తింపుతో నిలిచారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు తరువాత తలపడగల నటుడిగా కోటా పేరుగాంచారు. ఆయన పలుసార్లు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా కనిపించడమే కాకుండా, పలు పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

పద్మశ్రీతో పాటు 9 నంది అవార్డులు

కోటా శ్రీనివాసరావు తన నాలుగు దశాబ్దాల సినీ జీవితం మొత్తం తన నటనతో ఆకట్టుకున్నారు. నటన పట్ల ఆయన అంకితభావం ఫలితంగా ఆయనకు 2015లో పద్మశ్రీ లభించింది. అంతేకాకుండా, తొమ్మిది నంది అవార్డులు పొందడం ఆయన స్థాయిని తెలియజేస్తుంది. కోటా నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకుడిలో ఒక ముద్ర వేసింది. ఆయన నటన ఇప్పటికీ యువనటులకు ఒక పాఠశాలగా నిలుస్తోంది.

కోటా శ్రీనివాసరావు ఇకలేరు కానీ, ఆయన నటించిన పాత్రలు, డైలాగులు, బాడీ లాంగ్వేజ్ మాత్రం ఎన్నటికీ తెలుగు ప్రేక్షకుల్లో నిలిచిపోతాయి. ఆయన జీవితం నిజంగా ఓ సినిమాకే చక్కటి కథాంశం. ఆయనలాంటి నటులు అరుదు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Tags:    

Similar News