విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్ట‌ని కోట‌!

వెండితెర‌పై విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించే న‌టులు చాలా ఆరుదు. ఒక్కో న‌టుడికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది.;

Update: 2025-07-14 13:39 GMT

వెండితెర‌పై విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించే న‌టులు చాలా ఆరుదు. ఒక్కో న‌టుడికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. అయితే న‌ట‌న‌కు పెట్ట‌ని కోట‌గా పేరు తెచ్చుకున్న కోట శ్రీ‌నివాసరావు మాత్రం ఇందుకు భిన్నం. ఎందుకంటే కమెడియ‌న్‌గా న‌వ్వులు పూయించ‌గ‌ల‌డు..అదే టైమ్‌లో క‌ర్క‌శ‌మైన విల‌నిజాన్ని ఒలికించ‌గ‌ల‌డు..తండ్రిగా, తాత‌గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకోగ‌ల‌డు. కంట‌త‌డి పెట్టించ‌గ‌ల‌డు. హ‌లో బ్ర‌ద‌ర్‌లో త‌న స‌హ‌య‌కుడిని టార్చ‌ర్ చేసే పాత్ర‌లో క‌నిపించినా చివ‌రికి కంట‌త‌డి పెట్టించారు.

`మండ‌లాదీశుడు`తో వివాదాల్లోకి...

`గ‌ణేష్‌`లో విల‌నిజానికి స‌రికొత్త భాష్యం చెప్పి ఔరా అనిపించారు. `మండ‌లాదీశుడు`లో కోట చేసిన పాత్ర ఆయ‌న న‌ట ప్ర‌స్థాన్ని మ‌రో మ‌లుపు తిప్పింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సాహ‌సోపేత‌మైన పాత్ర‌లో కోట క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆయ‌నకున్న‌ గ‌ట్స్‌కు ఈ క్యారెక్ట‌ర్ నిద‌ర్శ‌నంగా నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇది నంద‌మూరి తారాక రామారావు పార‌డీ సినిమా. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్‌ని పోలిన పాత్ర‌లో కోట న‌టించి త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో షాక్ ఇచ్చారు.

ఈ సినిమా వ‌చ్చే నాటికి లెజెండ‌రీ న‌టుడు, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. అలాంటి సంద‌ర్భంలో కోట ఆయ‌న క్యారెక్ట‌ర్‌ని పోట్రే చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఓ కొత్త న‌టుడు ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్‌ని చేయాలంటే చాలా గ‌ట్స్ ఉండాలి. అందులోనూ ఎన్టీఆర్‌ని నెగెటివ్‌గా చూపించే క్యారెక్ట‌ర్. రేపు దీని వ‌ల్ల త‌న కెరీర్ ఏమౌతుందో తెలియ‌దు. ఇది తెలిసి కూడా కోట `మండ‌లాదీశుడు`లో న‌టించ‌డం అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. కోట ఈ క్యారెక్ట‌ర్‌ని తెలిసి చేశారో తెలియ‌క చేశారో తెలియ‌దు కానీ చాలా బ్రిలియంట్‌గా ఆ పాత్ర‌కు ప్రాణం పోశారు.

అయితే ఈ సినిమాలో న‌టించ‌డం వ‌ల్ల అప్ప‌ట్లో కోట శ్రీ‌నివాస‌రావు కెరీర్ ప‌రంగా ఎన్నోఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. లెజెండ‌రీ న‌టుడు ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కార‌ణంగా కోట‌కు అవ‌కాశాలు రావ‌డం గ‌గ‌నంగా మారింది. ఎంత‌గా అంటే అభిమానులు కోట‌కు చుక్కులు చూపించేంత‌. ఒక సంద‌ర్భంలో విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న క్ర‌మంలో ఎన్టీఆర్ అభిమానుల ఆగ్ర‌హం ఎలా ఉంటుందో కోట‌కు తెలిసి వ‌చ్చింది. అయితే అలా త‌న‌ని ద్వేషించిన విజ‌య‌వాడ‌లోనే కోట ఎమ్మెల్యేగా గెల‌వ‌డం విశేషం.

ఒకానొక సంద‌ర్భంలో `మండ‌లాదీశుడు` కార‌ణంగా తాను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడో త‌న స‌న్నిహితులు, ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర కోట బ‌య‌ట‌ప‌డ్డార‌ట. చాలా విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని ఫేస్ చేశాన‌ని వాపోయార‌ట‌. ఇంత‌గా ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇబ్బందుల్ని ఎదుర్కొన్న కోట‌కు అన్న‌గారి నుంచి మాత్రం ప్ర‌శంస‌లు ద‌క్కాయ‌ట‌. ఒకానొక సంద‌ర్భంలో కోట .. ఎన్టీఆర్‌ను క‌లిశార‌ట‌. ఆ సంద‌ర్భంగా ఆయ‌న అన్న‌మాట‌లు కోట ఎలాంటి న‌టుడో ప్ర‌పంచానికి తెలిసింది. నువ్వు అద్భుత‌మైన న‌టుడివ‌ని నేను విన్నాను` అని ఎన్టీఆర్ అన్నార‌ట‌. ఆ మాట‌లు విన్న కోట వెంట‌నే కిందికి వంగి ఎన్టీఆర్ కాళ్ల‌కు విన‌యంగ న‌స్క‌రించార‌ట‌.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి...

న‌ట‌న‌కు పెట్ట‌ని కోట‌గా పేరు తెచ్చుకున్న కోట ఓ బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. ఎంచుకున్న ప్ర‌తిపాత్ర‌లోనూ త‌న‌దైన ముద్ర వేస్తూ ప్ర‌త్య‌క‌త‌ను చాటుకుంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్ర‌తిఘ‌ట‌న‌, గాయం, గ‌ణేష్ వంటి సినిమాల్లో తెలంగాణ యాస‌లో ఆయ‌న ప‌లికించిన విల‌నీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. శ‌త్రువు, స‌ర్కార్ వంటి సినిమాల్లో త‌న‌దైన విల‌క్ష‌ణ‌మైన విల‌నీని ప్ర‌ద‌ర్శించి ఇలాంటి పాత్ర‌లు కోట‌కే సాధ్యం అనిపించారు.

విల‌నిజాన్ని ఏ స్థాయిలో పండించారో కామెడీని కూడా అదే స్థాయిలో పండించి ఇలా భిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌కు పెట్ట‌ని కోట అనిపించుకున్నారు. కామెడీ క్యారెక్ట‌ర్ల‌లో హ‌లో బ్ర‌ద‌ర్‌, మ‌నీ, అహ‌నా పెళ్లంటా, గోవిందా గోవిందా వంటి సినిమాల్లో క‌నిపించి అల‌రించారు. డార్క్ కామెడీ, స్లాప్స్టిక్ కామెడీ రోల్స్‌తో ఫ్రెష్ కామెడీని అందించారు. కోట రెగ్యుల‌ర్ క్యారెక్ట‌ర్ల‌కు భిన్నంగా అత‌డు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రేప‌టి పౌరులు, అన‌గ‌న‌గ ఒక‌రోజు వంటి త‌దిత‌ర సినిమాల్లో క‌నిపించారు. విల‌న్ పాత్ర‌ల నుంచి కామెడీకి, కామెడీ నుంచి సెటైరిక‌ల్, సెంటిమెంట్‌ క్యారెక్ట‌ర్ల‌కు ..ఇలా విభిన్న‌త‌ను చూపించి న‌టుడిగా ఎవ‌రూ చేయ‌లేని పాత్ర‌ల్లో క‌నిపించి అంద‌రు అవాక్క‌య్యేలా చేశారు. ఏ పాత్ర చేసినా అది చిన్న‌దా పెద్ద‌దా అని కాకుండా దానికి తాను ఎంత వ‌ర‌కు న్యాయం చేశాన‌నే కోణంలో ఆలోంచేవారే కానీ ఏనాడూ చిన్న క్యారెక్ట‌ర్ అని ఫీల‌వ‌లేదు.

కోట నాన్ లోక‌ల్ నినాదం..

కోటకు చాటున మాట్లాడ‌టం తెలియ‌దు. ఏది మాట్లాడినా స్ట్రెయిట్ ఫార్వ‌ర్డ్‌గానే మాట్లాడే త‌త్వం కోట సొంతం. సొంత భాష‌కు చెందిన న‌టీన‌టుల‌ని ప‌క్క‌న పెట్టి ప‌ర‌భాషా న‌టుల‌కు అవ‌కాశాలు పెరుగుతున్న క్ర‌మంలో కోట త‌న గ‌ళాన్ని బ‌లాంగా వినిపించారు. ఏ వేదిక ల‌భించినా మ‌న వాళ్ల‌ని చుల‌కన‌గా చూస్తున్నార‌ని, మ‌న వాళ్ల‌ని ప‌క్క‌న పెట్టి ప్రామ్టింగ్ ఇస్తూ భాష తెలియ‌ని వాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఓపెన్‌గా నిల‌దీసిన త‌త్వం కోట‌ది. ఏ భాష‌లోకి వెళ్లిన స్థానికుల‌కే పెద్ద పీట వేస్తున్నార‌ని, కానీ మ‌న వాళ్లు మాత్రం ఇత‌ర భాష‌ల న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్‌ల‌కు అవ‌కాశాలు ఇస్తున్నార‌ని నిల‌దీశారు. భాష రాని వాళ్ల‌కు ఎందుకు అవ‌కాశాలు ఇస్తున్నార‌ని, దాని వ‌ల్ల మ‌న వాళ్లు అవ‌కాశాలు కోల్పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. దీంతో కోట నాన్ లోక‌ల్ నినాదం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే కోట మాత్రం త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి అక్క‌డ కూడా మంచి పేరు తెచ్చుకోవ‌డం విశేషం.

విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న చోటే...

`మండ‌లాదీశుడు` సినిమా కోట‌కు ఒక ద‌శ‌లో నైట్ మేర్‌గా మారింది. ఇందులో స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు పాత్ర‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఎన్టీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌నని నెగెటివ్‌గా పోట్రే చేస్తూ ఈ మూవీ చేశారు. అలా ఆ నెగెటివ్ క్యారెక్ట‌ర్‌లో భీమ్ రావుగా కోట న‌టించారు. బ్ర‌తికున్న వ్య‌క్తి క్యారెక్ట‌ర్ క‌దా హిట్ అయితే మంచి పేరొస్తుంద‌ని న‌టించార‌ట‌. అదే ఆయ‌న‌కు తీవ్ర ఇబ్బందుల్ని తెచ్చి పెట్టింది. ఏడాది పాటు సినిమాలు ల‌భించ‌క తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.

విజ‌య‌వాడ‌లో `మండ‌లాదీశుడు`లో న‌టించిన కార‌ణంగా అవ‌మానాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. పెద్ద సంఖ్య‌లో విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్‌లో గుమిగూడిన ఎన్టీఆర్ అభిమానుల ఆగ్ర‌హాన్ని కోట రుచి చూడాల్సి వ‌చ్చింద‌ట‌. అయితే విమ‌ర్శ‌లు, చీత్కారాలు ఎదుర్కొన్న చోటే కోట ఎమ్మెల్యేగా గెలిసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌రుపున విజ‌య‌వాడ వెస్ట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఆ త‌రువాత రాజ‌కీయాల్లో ఎక్కువ కాలం కొన‌సాగ‌లేక సినిమాల‌కే ప‌రిమితమ‌య్యారు.

దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ...

న‌టుడిగా కోట ఎన్నో మైలురాళ్ల‌ని అధిరోహించారు కానీ బ్ర‌తుకు సాగ‌రంలో మాత్రం వెన‌బ‌డిపోయారు. భార్య రుక్మినికి 1973లో డెలివ‌రీ అయిన‌ప్పుడు ఆమె త‌ల్లి మ‌రణించార‌ట‌. ఆ షాక్ కార‌ణంగా త‌ను 30 ఏళ్ల పాటు త‌న‌ని గుర్తు ప‌ట్ట‌లేద‌ని, మాన‌సిక కుంగుబాటుకు గురైంద‌ని ఓ సంద‌ర్భంలో కోట చెప్పారు. ఓ ప్ర‌మాదంలో కూతురు కాలు కోల్పోయింది. ఆ త‌రువాత పెళ్లి కుదిరి సంతోషంగా ఉన్న సంద‌ర్భంలోనే ఆయ‌న త‌న‌యుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంద‌డం కోట‌ను మాన‌సికంగా కృంగ‌దీసింది.

ఈ విషాదాల గురించి కోట ఓ సంద‌ర్భంలో ఇలా చెప్పుకొచ్చారు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఫేమ్‌ని, డ‌బ్బుని అందించాడు. అయితే నా మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను మాత్రం తీసుకుపోయాడు. నా కొడుకుని తీసుకుపోయాడు. నా కూతురుని అవిటి దాన్ని చేసి ఎంతో శోకాన్నిచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆ దేవుడిని ఒక్క‌టే ప్రార్థిస్తున్నా.. వ‌చ్చే జ‌న్మ‌లో అయినా నాకు ప్ర‌శాంతమైన వ్య‌క్తిగ‌త జీవితాన్ని అందించ‌మ‌ని` అన్నారు.

Tags:    

Similar News