బ్యాండ్ మేళం రిజల్ట్.. కోన వెంకట్ ఏమంటారో మరి?
టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో వరుస హిట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, కొన్ని సంవత్సరాలుగా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేక కాస్త సైలెంట్ అయ్యారు.;
టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో వరుస హిట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, కొన్ని సంవత్సరాలుగా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేక కాస్త సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ వాల్తేరు వీరయ్యతో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించారు. ఆ చిత్రానికి ఆయన రచనా సహకారం అందించడం విశేషం.
ఇక రైటర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన జర్నీని కొనసాగిస్తున్న కోన వెంకట్, తాజాగా బ్యాండ్ మేళం చిత్రాన్ని నిర్మించారు. రైటర్ గా కూడా ఆయనే వ్యవహరించగా.. హీరోహీరోయిన్లుగా కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి నటించారు. కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి ఆ సినిమాను తెరకెక్కించారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఆ చిత్రం, యూత్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే విడుదల తర్వాత మూవీకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం నిరాశపరిచింది. పల్లెటూరి నేపథ్యంలో లవ్ స్టోరీగా తెరకెక్కించినప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన మైనస్ గా నిలిచింది. రొటీన్ కథ కారణంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని రివ్యూలు వస్తున్నాయి. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు కూడా పెద్దగా గుర్తుండిపోయేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత వరకు బాగున్నప్పటికీ, కథ స్ట్రాంగ్ గా లేకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల పనితనం కొన్ని సన్నివేశాల్లో మెప్పించింది. హర్ష్ రోషన్ తన పాత్రలో ఒదిగిపోయినప్పటికీ, కొన్నిచోట్ల నటన అతిశయంగా అనిపించిందని విమర్శలు వచ్చాయి. హీరోయిన్ శ్రీదేవి నటన పరవాలేదనిపించింది.
సీనియర్ నటులు సాయికుమార్, గోపరాజు తమ పాత్రల పరిధిలో నటించారు. కానీ ఇలాంటి వీక్ కథతో సినిమా ఎలా తీశారనే ప్రశ్నలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అనుభవజ్ఞుడైన కోన వెంకట్.. ఈ స్క్రిప్ట్ ను ఎలా రాశారన్నది ఆశ్చర్యంగా మారింది. దర్శకుడు సతీష్ జవ్వాజి కథనంలో లేదా ప్రెజెంటేషన్ లో కొత్తదనం చూపించలేకపోయారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు ముందు జరిగిన ఈవెంట్ లో కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా బ్యాండ్ మేళం. ఆ సినిమాను నా కోసం చూడండి. నచ్చకపోతే ఇకపై నేను రాసిన మూవీలు చూడకండి. అయినా నేను రాయడం మాత్రం ఆపను. ప్రేక్షకులకు నచ్చేవరకు రాస్తూనే ఉంటా" అని ఆయన ధైర్యంగా చెప్పారు. కానీ ఇప్పుడు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని పలువురు నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోన వెంకట్ ఆ విషయంపై మళ్లీ స్పందిస్తారా? లేక మౌనం వహిస్తారా? అనేది చూడాలి.