100 కోట్ల పారితోషికం క్ల‌బ్‌లోకి శివ‌కార్తికేయ‌న్?

కోలీవుడ్‌లో అగ్ర హీరోలు ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, అజిత్, విజ‌య్, సూర్య ఇంత మంది ఉండ‌గా, వీళ్లంద‌రినీ వెంబ‌డిస్తున్న ఒకే ఒక్క హీరో శివ‌కార్తికేయ‌న్ అనే విష‌యాన్ని గ‌మ‌నించాల్సిన టైమ్ వ‌చ్చింది.;

Update: 2026-02-19 00:30 GMT

కోలీవుడ్‌లో అగ్ర హీరోలు ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, అజిత్, విజ‌య్, సూర్య ఇంత మంది ఉండ‌గా, వీళ్లంద‌రినీ వెంబ‌డిస్తున్న ఒకే ఒక్క హీరో శివ‌కార్తికేయ‌న్ అనే విష‌యాన్ని గ‌మ‌నించాల్సిన టైమ్ వ‌చ్చింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బ‌స్ కండ‌క్ట‌ర్ శివాజీరావ్ గైక్వాడ్ నెమ్మ‌దిగా నట‌న‌లో అడుగులు వేసి ర‌జనీకాంత్ గా మారి సూప‌ర్‌స్టార్‌గా రూపాంత‌రం చెందిన తీరు గురించి ఎక్కువ‌గా ముచ్చ‌టిస్తాం కానీ, ఇప్పుడు మ‌రో త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ ఎదిగిన తీరు గురించి ఆరా తీస్తే నోరెళ్ల‌బెట్ట‌కుండా ఉండ‌లేరు!

అత‌డి జ‌ర్నీ గురించి షాకిచ్చే విష‌యాలే తెలుస్తున్నాయి. శివ కార్తికేయ‌న్ మ‌రో రామ్ చ‌ర‌ణ్ లా ఎదుగుతున్నాడు అంటే అతిశ‌యోక్తి కాదేమో! ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండా ఒక మిమిక్రీ ఆర్టిస్టుగా మొద‌లై, అత‌డు న‌ట‌న‌లో ప్ర‌వేశించి ఈరోజు సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. ల‌క్ష‌లు కాస్తా కోటికి ఎగ‌బాకింది అతడి పారితోషికం.. ఇప్పుడు ఏకంగా 30 కోట్ల నుంచి 60 కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి ఎగ‌బాకాడు. చూస్తుండ‌గానే 100 కోట్ల పారితోషికం అందుకునే హీరోగా రూపాంత‌రం చెందుతున్న‌ట్టే క‌నిపిస్తోంది సీన్.

మొత్తానికి శివ‌న్న జ‌ర్నీ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అత‌డు కెరీర్ ఆరంభ‌ దశలో `3` అనే సినిమాలో ధనుష్ పక్కన చిన్న పాత్రలో కనిపించినప్పుడు ఎవరూ పెద్దగా గుర్తించలేదు. తెలుగువాళ్ల‌కు అత‌డు ఎవ‌రో కూడా తెలీదు. ఆ త‌ర్వాత 2016లో వచ్చిన `రెమో` అనువాద సినిమాతో తెలుగు యువతకు.. ముఖ్యంగా అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యారు. `వ‌రుణ్ డాక్టర్` నుండి శివ‌కార్తికేయ‌న్ ప్రతి సినిమా తెలుగులో మంచి ఓపెనింగ్స్ రాబడుతోంది. `అమరన్` సినిమాతో ఆయనకు తెలుగులో 30 కోట్ల పైచిలుకు షేర్ రావడం ఒక సంచలనం. ఇటీవ‌ల వచ్చిన `పరాశక్తి`తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక పారితోషికంలో ఇప్పుడు 60 కోట్ల మార్క్ వ‌ద్ద ఉన్నాడు. నెమ్మ‌దిగా అత‌డి రేంజ్ టెన్షన్ లేకుండా 100 కోట్ల పారితోషికం వైపు వెళ్తోంది. ఇది నిజంగా ఒక బ్యాక్ గ్రౌండ్ లేని హీరోకి న‌మ్మ‌శ‌క్యం కాని ఫిగ‌ర్.

ఒక‌సారి గ‌తంలోకి వెళితే.. హైద‌రాబాద్ తాజ్ కృష్ణలో అత‌డికి ఎదురైన‌ చేదు అనుభవం గురించి మాట్లాడుకోవాలి. అత‌డు త‌న కెరీర్ తొలినాళ్ల‌లోని సినిమాల‌ను తెలుగులో రిలీజ్ చేయాల‌ని త‌పించాడు. వాటి అనువాదాల ప్ర‌మోష‌న్స్ కోసం హైద‌రాబాద్ తాజ్ కృష్ణ‌ కి వ‌చ్చిన‌ప్పుడు అత‌డిని తెలుగు మీడియా అంత‌గా ప‌ట్టించుకోలేదు. ర్యాండ‌మ్ గా ఎవ‌రో ఒక పొరుగు హీరో ప్ర‌చారానికి వ‌చ్చాడులే అనుకునేవారు. శివ‌కార్తికేయ‌న్ కి ఇంత సీన్ ఉంటుంద‌ని క‌నీసం మీడియా అయినా ఊహించ‌లేదు. అప్పట్లో టాలీవుడ్‌లో ఆయనొక కొత్త ముఖం కావడమే నాటి ఘ‌ట‌న‌ల‌కు కార‌ణం. అప్ప‌టికి ల‌క్ష‌ల్లోనే పారితోషికం..ఐదారేళ్ల లో అత‌డి రేంజు 1 కోటికి చేరుకుంది..ఇప్పుడు 12 ఏళ్ల కెరీర్ లో ఏకంగా 60 కోట్లు అందుకుంటున్నాడు.. అమ‌ర‌న్, ప‌రాశ‌క్తి విజయాల‌తో సీన్ అంతా మారిపోయింది.. మునుముందు 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అమ‌ర‌న్ 300కోట్ల క్ల‌బ్ సినిమా. త‌దుప‌రి చిత్రం సియోన్ 500 కోట్ల క్ల‌బ్ లో చేరితే, అత‌డి డిమాండ్ 100 కోట్ల‌కు చేరుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. పారితోషికం పెంచుకోవ‌డం హీరోల ఇష్టం గ‌నుక ఇదేమీ క‌ష్టం కాదు.

మ‌రింత డీటెయిల్డ్ గా అత‌డి ఫ్లాష్ బ్యాక్ ని ప‌రిశీలిస్తే, అత‌డు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ త‌ర్వాత న‌ట‌నా రంగానికి ప‌రిచ‌య‌మ‌య్యాడు. సినీ పరిశ్రమకు పూర్తిగా ఔట్‌సైడ‌ర్‌. అత‌డికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగాడు. అత‌డి తండ్రి జైలు శాఖలో పని చేసేవారు. చదువుకునే రోజుల్లోనే ఆయన తండ్రి చనిపోయారు. మొదట టీవీ షోలలో శివ‌కార్తికేయ‌న్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విజయ్ టీవీలో యాంకర్‌గా సూపర్ హిట్ అయ్యారు.

చాలామంది న‌ట‌వార‌సులు తండ్రుల అండ‌దండ‌ల‌తో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా ఇక్క‌డ ప‌న‌వ్వ‌డం లేదు. కానీ బాలీవుడ్ లో కార్తిక్ ఆర్య‌న్, ఆయుష్మాన్ ఖురానా త‌ర‌హాలో కోలీవుడ్ లో శివకార్తికేయన్ తన కష్టంతోనే ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అందుకే అత‌డిని తమిళనాట `నెక్స్ట్ లెవెల్ స్టార్` అని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రెస్ మీట్‌లలో ఎవరూ పట్టించుకోని స్థాయి నుండి.. ఈరోజు ఒక సినిమాకు 60 కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి చేరారు. 100 కోట్లు అత‌డి నెక్ట్స్ టార్గెట్ అన్న‌మాట‌!!

తాజ్ కృష్ణ అనుభవం ఒక గుణపాఠం

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన ఆ చేదు అనుభవం ఇప్పుడు ఆయనకు ఒక స్ఫూర్తి. అప్పట్లో తెలుగు మీడియాకు ఆయన ఎవరో తెలియదు.. కానీ ఇప్పుడు అదే మీడియా ఆయన ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే `సుడి` కంటే ఆయన `స్థిరత్వం` ఈ స్థాయికి చేర్చింది.

Tags:    

Similar News