డిజాస్టర్ వచ్చినా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేశాడు

ఒక సినిమా పెద్దగా ఆడకపోయిందంటే దర్శకుడి కెరీర్ అక్కడితోనే ముగిసిపోయినట్టే అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో చాలామందిలో ఉంటుంది.;

Update: 2025-04-24 12:30 GMT

ఒక సినిమా పెద్దగా ఆడకపోయిందంటే దర్శకుడి కెరీర్ అక్కడితోనే ముగిసిపోయినట్టే అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో చాలామందిలో ఉంటుంది. కానీ ఆ ధోరణిని చెదరగొట్టేలా ఒక యువ దర్శకుడు ముందడుగు వేశాడు. 'గని' ఫెయిల్యూర్ తర్వాత టాలీవుడ్‌లో కొన్నాళ్ళు కనిపించకుండా పోయినా.. ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతున్నాడు డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

2023లో విడుదలైన 'గని' సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన భారీ బడ్జెట్‌ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో వరుణ్ తేజ్ హీరోగా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కనిపించింది. భారీ ప్రమోషన్స్, హైహోప్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఫ్లాప్ అంటే.. మామూలు ఫ్లాప్ కాదు. థియేట్రికల్ గా 80 శాతానికి పైగా నష్టాలను చూపించి నిర్మాతను ఉహించని దెబ్బ కొట్టింది.

కథను డీల్ చేయడంలో దర్శకుడు కొంత వెనకబడిపోయాడన్న విమర్శలతో కిరణ్ కొర్రపాటి పేరు మళ్లీ వినిపించలేదు. అయితే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏమిటంటే.. దర్శకుడు కిరణ్ కొర్రపాటి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడో మళ్లీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారనుకున్న తరుణంలో హిందీలో సినిమా ప్రారంభించడం అనేది పెద్ద విషయమే. ఉత్తర భారతంలో పవిత్రంగా భావించే వారణాసి ఘాట్‌లపై పూజలు నిర్వహించి ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఇదే కిరణ్ తొలి హిందీ సినిమా కానుంది.

ఈ సినిమాను నిర్మించేది ప్రముఖ నిర్మాత సాజిద్ ఖురేషీ. ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఐదు సినిమాలను నిర్మించిన ఈ నిర్మాత ఇన్ బాక్స్ పిక్చర్స్ పతాకంపై సినిమా తెరకెక్కిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఇది సరికొత్త ప్రయోగంగా నిలవనుందని అంటున్నారు. సినిమా మొత్తం ముంబయి, లక్నో లొకేషన్లలో భారీగా షూట్ చేయనున్నారు. క్యాస్టింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఈసారి మాత్రం కథ విషయంలో ఆయన బాగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.

ఇటీవలే సందీప్ రెడ్డి వంగా (కబీర్ సింగ్, యానిమల్) గోపీచంద్ మలినేని (జాట్) బాలీవుడ్‌లో తమ గుర్తింపును పెంచుకున్నారు. ఇప్పుడు కిరణ్ కూడా ఆ జాబితాలోకి చేరారు. ఒకప్పటి ఫెయిల్యూర్‌కు తావివ్వకుండా, కొత్త ప్రయత్నంతో ముందుకు రావడం అభినందనీయం. టాలీవుడ్ దర్శకుల్లో బాలీవుడ్ కెరీర్‌ను డ్రీమ్‌గా చూసేవారు చాలామంది ఉన్నప్పటికీ, నేరుగా వెళ్లి సినిమా మొదలుపెట్టేవారు మాత్రం కొద్ది మందే. ఇక కిరణ్ తీసే ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News