డ్రాగన్ కయాదు కి బిగ్ ఛాన్స్
తాజాగా శింబు 49 చిత్ర యూనిట్ సభ్యులు కయాదు లోహర్ కు వెల్‌కమ్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.;
ఈ మధ్య కాలంలో తమిళ్‌తో పాటు తెలుగు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో కయాదు లోహర్ ఒకటి. ఈ అమ్మడు కన్నడ మూవీ ముగిల్పేటతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత మలయాళ సినిమా పతోన్పథం నూత్తండులో నటించింది. ఆ వెంటనే తెలుగు సినిమా అల్లూరి లో ఈమె నటించింది. కన్నడం, మలయాళం, తెలుగు సినిమాల తర్వాత ఈమెకు మరాఠీ సినిమాలో ఆఫర్ దక్కింది. 2023లో మరాఠి మూవీ ఐ ప్రేమ్ యు సినిమాలో నటించడం ద్వారా తమిళ్ మూవీ 'డ్రాగన్'లో ఛాన్స్ దక్కింది. ప్రదీప్ రంగనాథన్ కి జోడీగా కయాదు లోహర్ ఒక హీరోయిన్‌గా నటించి మెప్పించిన విషయం తెల్సిందే.
అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఆఫర్లు అడపా దక్కించుకుంటూ వచ్చిన కయాదు లోహర్ 'డ్రాగన్' సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. కోలీవుడ్‌లో ఏకంగా స్టార్ హీరో శింబు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ఈమె తమిళ్ మూవీ ఇదయం మురళి లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే తమిళ్ స్టార్ హీరో శింబుతో నటించేందుకు రెడీ అయింది. తాజాగా శింబు 49 చిత్ర యూనిట్ సభ్యులు కయాదు లోహర్ కు వెల్‌కమ్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఈ అమ్మడి సొంతం అని డ్రాగన్ సినిమాతో నిరూపితం అయ్యింది.
టాలీవుడ్‌లో ఈమె ఇప్పటికే అల్లూరి అనే సినిమాలో నటించింది. కానీ తెలుగులో గుర్తింపు దక్కలేదు. డ్రాగన్ సినిమా తెలుగు వర్షన్ కారణంగా ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది. తెలుగులో ఈ అమ్మడికి ఇప్పటికే ఒకటి రెండు ఆఫర్లు వచ్చాయని, చర్చల దశలో ఉన్న ఆ సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే కయాదు లోహర్ తమిళ్, తెలుగు సినిమాల్లో మరింత బిజీ కావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కయాదు లోహర్ ఓకే చెప్పాలే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ఏడాదిలో అరడజను సినిమాలను చేయగలదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
కయాదు లోహర్ తన కెరీర్‌ను ఆభరణాల ప్రమోషన్‌తో ప్రారంభించింది. 2021లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో పాల్గొనడంతో కన్నడ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు తమిళనాట ప్రముఖ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న STR49 చిత్రంలో నటించే అవకాశం దక్కడంతో ముందు ముందు ఈమె నుంచి మరిన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళ్‌లోనే కాకుండా ఈమెకు తెలుగు, కన్నడ భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈమె తన అందమైన ఫోటోలను, వీడియోలను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 2.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఈ అమ్మడు కలిగి ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే ఈ స్థాయి ఫాలోవర్స్‌ను దక్కించుకోవడం పెద్ద విషయం.