సోగ్గాళ్లకు ఈసారి అంత ఈజీ కాదేమో..
అక్కినేని ఫ్యామిలీ నుండి ముగ్గురు హీరోలు ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. కానీ 'సోగ్గాళ్లు' సినిమాకు 2027 సంక్రాంతి పోరు అంత సులభంగా ఉండేలా లేదు.;
అక్కినేని ఫ్యామిలీ నుండి ముగ్గురు హీరోలు ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. కానీ 'సోగ్గాళ్లు' సినిమాకు 2027 సంక్రాంతి పోరు అంత సులభంగా ఉండేలా లేదు. ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర సీనియర్ హీరోల పోటీ, మరోవైపు మారిన ప్రేక్షకుల అభిరుచి మధ్య ఈ పాత ఫార్ములాను నెట్టుకురావడం కళ్యాణ్ కృష్ణకు పెద్ద పరీక్షే. ఈసారి సోగ్గాళ్ల సందడికి అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి.
మొదటి సవాలు బాక్సాఫీస్ వద్ద ఉన్న హెవీ కాంపిటీషన్. చిరంజీవి-బాబీ, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలు పండగని టార్గెట్ చేస్తున్నాయి. కానీ ఎవరు వస్తారు ఎవరు డ్రాప్ అవుతారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. వెంకటేష్-అనిల్ రావిపూడి మాత్రం పక్కా వచ్చే అవకాశం ఎక్కువే. ఇలా సీనియర్లు పక్కా మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో పండగ రేసులో ఉంటే పోటీ మాములుగా ఉండదు. ముగ్గురు అక్కినేని హీరోలు ఉన్నా సరే, థియేటర్ల కేటాయింపు దగ్గర నుండి వసూళ్ల వరకు ఈ కాంబినేషన్స్ తట్టుకుని నిలబడటం సామాన్యమైన విషయం కాదు.
అలాగే 'అక్కినేని' బ్రాండ్ నే నమ్ముకుంటే ఈసారి పప్పులు ఉడికేలా లేవు. ఇక కంటెంట్ పరంగా ఎదురయ్యే రిస్క్ మరొకటి. 'సోగ్గాడే', 'బంగార్రాజు' సినిమాల్లో ఆత్మలు రావడం, ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు ఆల్రెడీ అలవాటైపోయాయి. మూడోసారి కూడా అదే రొటీన్ ఫార్ములాను రెగ్యులర్ గా చూపిస్తే జనాలు బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉంది. విలేజ్ కామెడీ, మాస్ ఎలివేషన్లు ఓకే కానీ, ముగ్గురు హీరోలకు సరిపడా బలమైన కథను సిద్ధం చేయడం కత్తిమీద సామే. సత్యానంద్ స్క్రీన్‌ప్లే ఈసారి అద్భుతాలు చేస్తే తప్ప కొత్తదనం రావడం కష్టం.
మ్యూజిక్ మేటర్ కూడా ఈసారి పెద్ద ఛాలెంజ్. గత రెండు సినిమాల సక్సెస్‌లో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సగం రోల్ ప్లే చేసింది. కానీ ప్రస్తుతం అనూప్ ఫామ్‌లో లేకపోవడం సినిమాకు పెద్ద లోటు. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చినా, ఈ ఫ్రాంచైజీకి ఉన్న ఆ సిగ్నేచర్ ట్యూన్స్‌ను, ఆ వైబ్‌ను కొత్తవారు ఎంతవరకు మ్యాచ్ చేస్తారనేది అనుమానమే. పాటలు క్లిక్ అవ్వకపోతే ఈ సోగ్గాళ్ల హడావుడికి అంతగా బజ్ రాకపోవచ్చు.
అన్నిటికంటే ముఖ్యంగా అఖిల్ పాత్రను హ్యాండిల్ చేయడం. నాగార్జున, చైతన్యకు ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీలో ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు అఖిల్‌ను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఆయనకు ఇచ్చే ఎలివేషన్లు అతిగా అనిపిస్తాయా లేక కథలో భాగంగా ఉంటాయా? అనేది ముఖ్యం. అక్కినేని వారసులందరినీ సంతృప్తి పరచాలనే తాపత్రయంలో దర్శకుడు కమర్షియల్ హంగులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే కథ దెబ్బతినే ప్రమాదం ఉంది. చివరిగా, మూడేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత కళ్యాణ్ కృష్ణ మెగాఫోన్ పడుతున్నారు. ఈ మధ్యలో టాలీవుడ్ మేకింగ్ స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయాయి. పాత ఫార్ములాతోనే నెట్టుకొస్తామంటే ఈసారి రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ సవాళ్లన్నీ దాటుకుని సోగ్గాళ్లు మళ్ళీ సంక్రాంతి విన్నర్ గా నిలవాలంటే.. కేవలం మ్యాజిక్ సరిపోదు, మ్యాటర్ కూడా గట్టిగా ఉండాలి.