వేసవి తర్వాత సీజన్ టార్గెట్ చేసారా?
రెండేళ్లగా వేసవి లో సరైన సినిమాలు రిలీజ్ అవ్వని సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లను తాత్కాలికంగా మూసి వేసిన ఘటనలున్నాయి.;
రెండేళ్లగా వేసవి లో సరైన సినిమాలు రిలీజ్ అవ్వని సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లను తాత్కాలికంగా మూసి వేసిన ఘటనలున్నాయి. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది.టైర్ 2, టైర్ 3 హీరోలు కూడా స్టోరీలు..దర్శకుల పరంగా సెలక్టివ్ గా ఉండటంతో ఔట్ పుట్ బాగా తగ్గిపోయింది. దీంతో గత రెండు సమ్మర్ సీజన్లలో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ కరువైంది. కానీ ఈ సమ్మర్ మాత్రం రిలీజ్ లు బాగానే కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలతో పాటు కన్నడ, హిందీ పరిశ్రమల నుంచి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలు కనిపిస్తున్నాయి.
ఆ సినిమాలకు హిట్ టాక్ వస్తే గనుక వేసవి సీజన్ వాటితో ముగించొచ్చు. రేసులో పోటా పోటీగా కొన్ని సినిమాలు...గ్యాప్ తీసుకుని మరికొన్ని తెలుగు చిత్రాలు రిలీజ్ కు ఉండటంతో? ఈ సమ్మర్ కి ఎంటర్ టైన్ మెంట్ కి కొదవలేదు. అలాగే వేసవి అనంతరం మరికొన్ని చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓసారి వాటి వివరాల్లోకి వెళ్తే...మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో `కొరియన్ కనకరాజు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా వేసవికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ డిలే అవ్వడంతో చిత్రాన్ని వేసవి తర్వాత రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. మిగతా షూటింగ్ సహా అన్ని పనులు పూర్తవ్వడానికి ఎలా లేదన్నా మరో మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుంది. అనంతరమే చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్య తెలుగు డెబ్యూ చిత్రం కావడంతో ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అలాగే అక్కినేని వారసుడు అకిల్ హీరోగా `లెనిన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతుంది.
ఈ సినిమా కూడా షూటింగ్ మెల్లగా జరుగుతోంది. మరో స్టార్ కు పోటీగా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఈ నేపత్యంలో ఆగస్టు తర్వాత రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా మెగా మేనల్లుడు సాయిదుర్గ తేజ్ హీరోగా `సంబరాల ఏటిగట్టు` ను చెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా సినిమా సెట్స్ లోనే ఉంది. రిలీజ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. వాస్తవానికి ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ నత్త నకడక షూటింగ్ జరగడంతో? అన్ని పనులు వాయిదా పడుతున్నాయి.
అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా `టైసన్ నాయుడు` కూడా ఏడాదిన్నర కాలంగా నలుగుతోన్న చిత్రం. షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం సహా రకరకాల కారణలతో డిలే అవుతుంది. ఈ చిత్రాలన్నీ సమ్మర్ సహా ఆగస్టులో రిలీజ్ కానున్న `పౌజీ` తర్వాత ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.