నా సినిమాలు రిలీజ్ కాకూడదని నేనే కోరుకున్నా
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని ఇప్పటికే పలువురు నటీనటులు వెల్లడించారు. అవకాశాల కోసం ఎదురుచూడడం నుంచి, పాత్రల ఎంపిక వరకు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.;
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని ఇప్పటికే పలువురు నటీనటులు వెల్లడించారు. అవకాశాల కోసం ఎదురుచూడడం నుంచి, పాత్రల ఎంపిక వరకు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్లకే ఇబ్బందులుంటాయంటే ఇక సపోర్టింగ్ రోల్స్ చేసేవారికి అవి ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కఠిన పోటీలను ఎదుర్కోవడంతో పాటూ కొన్నిసార్లు అనవసర ఒత్తిళ్లకు కూడా లోనవాల్సి ఉంటుంది. యాక్టింగ్ కంటే రూపానికి ప్రాధాన్యం ఇవ్వడం, వయసు పెరిగేకొద్దీ అవకాశాలు తగ్గిపోవడం లాంటి సమస్యలు వారిని కెరీర్ లో వెనక్కి నెట్టేస్తుంటాయి. అయినప్పటికీ తమ టాలెంట్, పట్టుదలతో ఆ ఛాలెంజెస్ ను దాటుకుంటూ ముందుకు సాగి, ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంటారు.
అలా ఇప్పటికే ఎంతో మంది మహిళా నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టిన సందర్భాలున్నాయి. ఇప్పుడు సీనియర్ నటి నీనా గుప్తా తన సినీ జర్నీని వెనక్కి తిరిగి చూసుకుంటూ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చకు దారి తీశాయి. కెరీర్‌లో కొన్ని సినిమాలు చేసినందుకు తాను బాధపడ్డానని, ఆ సినిమాలు, పాత్రలు నచ్చకపోయినా తాను వాటిలో నటించినట్టు ఆమె పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్న నీనా గుప్తా
టాలెంట్ విషయంలో ఎలాంటి లోటు లేని నటిగా పేరు తెచ్చుకున్న నీనా గుప్తా, అవకాశాలు లేని రోజులను కూడా ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఒక దశలో మంచి క్యారెక్టర్లు రాకపోయినా, ఆర్థిక ఇబ్బందుల కోసం కొన్ని సినిమాలను ఒప్పుకోవాల్సి వచ్చిందని, ఆ సినిమాలు నటిగా తనను ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయాయని, పైగా సెట్స్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు నీనా గుప్తా చెప్పారు.
ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నా
కొన్ని సినిమాల్లోని పాత్రల విషయంలో తాను ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నానని, అనవసరంగా ఆ సినిమాలను చేశాననిపిస్తుందని, షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక నేను నటించిన సినిమాలు రిలీజ్ కాకూడదని నేనే కోరుకునేదాన్నని, సెట్ లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు, కొంతమంది డైరెక్టర్లు కారణం లేకుండానే తనను అసభ్యపదాలతో తిట్టారని, అయినా సరే వేరే దారి లేక ఆర్థిక అవసరాల కోసం తాను ఆ సినిమాలను చేసినట్టు చెప్పారు.
నటిగా ఎదగాలంటే కేవలం పని చేయడం మాత్రమే సరిపోదని, ఆ పాత్ర నిన్ను గౌరవిస్తుందా లేదా అన్నది కూడా ముఖ్యమేనని నీనా గుప్తా చెప్తున్నారు. బధాయీ హో, శుభ్ మంగల్ జ్యాదా సావధాన్ లాంటి సినిమాలతో కూడా నీనా తన సత్తాను చాటారు. మంచి కథ, బలమైన పాత్ర లభిస్తే నటనకు వయసు అడ్డు కాదని ఆమె నిరూపిస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ కూడా నీనా సీరియల్స్ లో నటించి ఆడియన్స్ ను మెప్పించారు.