కార్తి సినిమాకు మళ్లీ చిక్కులా..
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన 'వా వాత్తియార్' సినిమా తెలుగులో 'అన్నగారు వస్తున్నారు' అనే టైటిల్ తో రానున్న విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన 'వా వాత్తియార్' సినిమా తెలుగులో 'అన్నగారు వస్తున్నారు' అనే టైటిల్ తో రానున్న విషయం తెలిసిందే. నలన్ కుమారసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్ నటించిన 'జననాయగన్' రేసు నుంచి తప్పుకోవడంతో ఈ పండుగ సీజన్ కార్తి సినిమాకు బాగా కలిసి వస్తుందని అందరూ భావించారు.
సాధారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడినప్పుడు మీడియం బడ్జెట్ చిత్రాలకు మంచి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా అదే జరుగుతోంది. జననాయగన్ పోస్ట్ పోన్ అవ్వడంతో వా వాత్తియార్ తో పాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతి రేసులోకి వచ్చాయి. మొదట్లో ఈ సినిమా ఫిబ్రవరికి వెళ్తుందని ప్రచారం జరిగినప్పటికీ, పండుగ స్లాట్ ఖాళీగా ఉండటంతో నిర్మాతలు రిస్క్ తీసుకుని ముందుకు వచ్చారు. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ తాజాగా మరో కొత్త లీగల్ కేసు ఫైల్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరూర్ కు చెందిన ధనేష్ అసోసియేట్స్ అనే సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పై కోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన అప్పును చెల్లించే వరకు సినిమాను విడుదల చేయనివ్వకూడదని వారు పిటిషన్ లో కోరారు. ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఇప్పటికే సతమతమవుతున్న ఈ సినిమాకు, ఈ కొత్త కేసు మరో తలనొప్పిగా మారింది.
అయితే కోలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వివాదంలో ఉన్న మొత్తం కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమేనని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రొడక్షన్ హౌస్ ఈ సమస్యను చాలా త్వరగానే పరిష్కరించే అవకాశం ఉంది. కానీ గతంలోనే మరో ఇన్వెస్టర్ వేసిన పాత కేసు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం మేకర్స్ ని కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఆ పాత సెటిల్మెంట్ గనుక పూర్తయితేనే కార్తి సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలోకి వస్తుంది.
మరోవైపు శివకార్తికేయన్ నటించిన 'పరాశక్తి' సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా సెంటర్లలో బుకింగ్స్ యావరేజ్ గానే కనిపిస్తున్నాయి. ఒకవేళ జనవరి 14న వా వాత్తియార్ కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సంక్రాంతి వీకెండ్ లో కార్తి బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ ని క్లియర్ చేసుకుని పక్కాగా థియేటర్లలోకి రావాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
మొత్తానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ల మీదనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అన్ని అడ్డంకులను దాటుకుని వా వాత్తియార్ అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. వరుస హిట్ల మీద ఉన్న కార్తికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.