విజయవాడలో రిషబ్.. ఆడియన్స్ ను కూల్ చేయగలరా?
కన్నడ నటుడు రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార చాప్టర్:1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.;
కన్నడ నటుడు రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార చాప్టర్:1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగులో కూడా విడుదల కానున్న ఆ సినిమా.. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాతోపాటు రిషబ్ పై కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది.
నిజానికి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రానుండడంతో కాంతార చాప్టర్ :1పై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు కూడా. కానీ ఇటీవల పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఏకంగా బాయ్ కాట్ కాంతార హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది.
అందుకు ముఖ్య కారణం.. హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ తెలుగులో మాట్లాడకపోవడం. ఇంత మంచి మార్కెట్ ఉన్న టాలీవుడ్ ఈవెంట్ లో కేవలం కన్నడలోనే మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు గౌరవం ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదని కూడా అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత తెలుగు రైట్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీంతో డబ్బింగ్ మూవీకి పెంపు ఎందుకని అంతా ప్రశ్నించారు. సినీ వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని టికెట్ రేట్ల పెంపునకు ఛాన్స్ ఇచ్చారు.
అయితే తెలుగు ఆడియన్స్ లో అసంతృప్తి అలానే ఉంది. అది ఓపెనింగ్స్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కాంతార విషయంలో ఉన్న వ్యతిరేకతను తొలగించాల్సిన బాధ్యత రిషబ్ శెట్టిపై ఎంతైనా ఉంది. తెలుగు సినీ ప్రియులతోపాటు అభిమానులను కూల్ చేసి.. మళ్లీ మూవీపై బజ్ క్రియేట్ చేయాల్సిందే.
హైదరాబాద్ ఈవెంట్ తోనే సమస్య అంతా స్టార్ట్ అవ్వగా.. ఇప్పుడు నేడు విజయవాడలో మరో ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్స్ లో జరగనున్న ఆ కార్యక్రమంలో రిషబ్ శెట్టి పాల్గొనున్నారు. కాబట్టి అదే ఆయనకు గోల్డెన్ ఛాన్స్. లేకుంటే ఓపెనింగ్స్ అనుకున్నంత స్థాయిలో రావు. దీంతో విజయవాడలో ఈవెంట్ ను ఆడియన్స్ ను కూల్ చేయడంలో ఎంత వరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.