దేవర దిగిపోయాడు.. ఇక యాక్షన్ డోస్ షురూ!

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల సినిమాల నుండి కొంత విరామం తీసుకోవడం అభిమానులను నిరుత్సాహపరచింది.

Update: 2024-05-23 08:18 GMT

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల సినిమాల నుండి కొంత విరామం తీసుకోవడం అభిమానులను నిరుత్సాహపరచింది. "RRR" చిత్రం 2022లో విడుదలై ఘన విజయాన్ని సాధించినప్పటి నుండి తారక్ మళ్ళీ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే రాబోయే రెండేళ్ళ లో మాత్రం మూడు హై వోల్టేజ్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "దేవర" సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాగే ఈమద్యే "వార్ 2" చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ కారణంగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్ గా కొంత రెస్ట్ తీసుకోవాలి అని తన 41వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేశారు. విదేశాలకు వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తారక్ మళ్ళీ జెట్ స్పీడ్ లో హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.

తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి మీడియా ముందు కనిపించిన తారక్, అక్కడ అందరికి హాయ్ చెప్పాడు. ఇక త్వరలోనే "వార్ 2" చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో, తారక్ ప్రత్యేకంగా ఈ విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తీరిక లేకుండా కష్టపడాల్సిన టైమ్ వచ్చింది.

Read more!

మొన్నటివరకు తారక్ ముంబై లోనే ఉన్నాడు. ఇక ఆ తరువాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, తన ఓటు హక్కు వినియోగించుకున్న తారక్ వెంటనే వెకేషన్ కు వెళ్ళాడు. ఇక ఇప్పుడు "దేవర" చిత్ర పనులను కూడా పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక భారీ షెడ్యూల్‌తో ఈ చిత్ర షూటింగ్‌ను ముగించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత తారక్ "వార్ 2" షూటింగ్‌లో మరింత బిజీ కానున్నారు.

రీసెంట్ గా "దేవర" సినిమా నుంచి ఫియర్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. "దేవర" రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు.

ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాను కూడా తారక్ ఈ ఏడాది ఆగస్టులో స్టార్ట్ చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు పనులు ఇప్పటికే స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే వార్ 2 అనంతరం ఎన్టీఆర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ లోనే మరో సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ రానుంది. మరి ఈ లైనప్ తో ఎన్టీఆర్ తన మార్కెట్ ను ఏ రేంజ్ లో పెంచుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News