మూవీ రివ్యూ : జెట్లీ

మత్తు వదలరా.. మత్తు వదలరా -2 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా.. ఆ రెండు చిత్రాల్లో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ సత్యను హీరోగా పెట్టి తెరకెక్కించిన చిత్రం జెట్లీ.;

Update: 2026-05-01 06:46 GMT

'జెట్లీ' మూవీ రివ్యూ

నటీనటులు: సత్య - రియా శర్మ - వెన్నెల కిషోర్ - అజయ్- కబీర్ సింగ్ దుల్హన్ - గుండు సుదర్శన్ - శ్రీనివాసరెడ్డి - హర్ష చెముడు - శుభలేఖ సుధాకర్ తదితరులు

సంగీతం: కాలభైరవ

ఛాయాగ్రహణం: సురేష్ సొరంగం

నిర్మాతలు: చెర్రీ - హేమలత

కథ - స్క్రీన్ ప్లే: రితేష్ రాణా - జయేంద్ర

మాటలు - దర్శకత్వం: రితేష్ రాణా

మత్తు వదలరా.. మత్తు వదలరా -2 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా.. ఆ రెండు చిత్రాల్లో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ సత్యను హీరోగా పెట్టి తెరకెక్కించిన చిత్రం జెట్లీ. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జైట్లీ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

ఒక మంత్రి అండతో 15 వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన బిజినెస్ మ్యాన్ ప్రజాపతి (అజయ్).. తన బదులు మరో వ్యక్తిని ఇరికించి దుబాయికి పారిపోతాడు. కొన్ని నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్ రియా (రియా శర్మ) తన టీంతో దుబాయికి వెళ్ళి ప్రజాపతిని పట్టుకుని తన ఎయిర్ లైన్స్ లోనే వెనక్కి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఫ్లైట్ ఎక్కాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అతడిని చంపడానికి కొందరు.. తప్పించడానికి కొందరు ప్రయత్నం చేస్తారు. మరి ఈ ప్రయత్నాల్లో ఎవరు విజయవంతం అయ్యారు... ఈ మొత్తం గొడవలో వేద వ్యాస్ (సత్య) పాత్ర ఏంటి.. చివరికి ప్రజాపతి వ్యవహారం ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కామెడీ పాత్రలు చేసే సత్యను హీరోగా పెట్టి ‘జెట్లీ’ సినిమాను అనౌన్స్ చేయడం మొదలు.. ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా.. రిలీజ్ దగ్గర పడ్డాక రితేష్ రాణా అండ్ టీమ్ చేసిన ప్రోమో వీడియోల్లో ఏది చూసినా నవ్వాపుకోవడం కష్టం. ఐతే ప్రోమోల్లోనే ఇంత ఫన్ ఉందంటే.. ఇక సినిమాలో ఇంకెంతగా నవ్వులు పండిస్తారో అని మంచి అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ప్రోమోల్లో చూపించినంత సెన్సాఫ్ హ్యూామర్ సినిమాలో చూపించలేకపోయాడు రితేష్ రాణా. తన రైటింగ్ అంతా ప్రోమోల కోసమే పెట్టేశాడా అన్నట్లు తయారైంది సినిమా పరిస్థితి. అక్కడక్కడా కొన్ని జోకులు పేలాయి.. సత్య తన వరకు ఎంటర్టైన్ చేయగలిగాడు తప్పితే.. మొత్తంగా చూస్తే ‘జెట్లీ’ అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. రేప్పొద్దున ఓటీటీలో రిలీజైనపుడు తీరిగ్గా చూస్తుంటే విడివిడిగా కొన్ని సీన్లు నవ్వించొచ్చు. కొన్ని జోకులు బాగానే అనిపించవచ్చు. కానీ బిగ్ స్క్రీన్ ముందు కూర్చున్నపుడు ఇవ్వాల్సినంత జోష్ మాత్రం ఈ సినిమా ఇవ్వలేకపోయింది. చాలా వరకు డల్లుగా సాగిన ‘జెట్లీ’.. సరిపడా ఎంటర్టైన్మెంట్ డోస్ ఇవ్వలేక బోర్ కొట్టించేసింది.

కామెడీ అనేది కత్తి మీద సాము లాంటిదే. టైమింగ్ సరిగ్గా కుదిరితే నవ్వులు పండుతాయి. లేదంటే నవ్వుల పాలు కాక తప్పదు. తన తొలి చిత్రం ‘మత్తువదలరా’లో నవ్వించి- థ్రిల్ చేసిన రితేష్ రాణా.. రెండో సినిమా ‘హ్యాపీ బర్త్ డే’లో టైమింగ్ కుదరక ప్రేక్షకులకు బోర్ కొట్టించేశాడు. ఆపై ‘మత్తువదలరా’తో ఫామ్ అందుకుని నవ్వించిన అతను.. ‘జెట్లీ’తో గాడి తప్పాడు. కామెడీ సినిమాల్లో కథ అన్నది పెద్ద విషయం కాదు కానీ.. ఇందులో అది మరీ మొక్కుబడి వ్యవహారం అయిపోయింది. పేరుకు బోలెడన్ని మలుపులు ఉన్నాయి కానీ.. అవేవీ కిక్కిచ్చేలా లేవు. ‘జెట్లీ’ సినిమా చూసిన వాళ్లను ఈ సినిమా కథేంటి అని అడిగితే.. సమాధానం చెప్పడం కష్టమవుతుంది. అంత కన్ఫ్యూజింగ్ గా.. నాన్ సీరియస్ గా కథను చెప్పాడు రితేష్ రాణా. ఐతే కామెడీ వర్కవుట్ అయినపుడు కథ గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు కానీ.. అది కుదరనపుడే సమస్య మొదలవుతుంది. ‘జెట్లీ’లో అదే జరిగింది.

సత్య పాత్రను పరిచయం చేసిన తీరు.. వెన్నెల కిషోర్ తో తన కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలతో మొదట్లో ‘జెట్లీ’ ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. రితేష్ రాణా మార్కు మీమ్ కామెడీ.. టార్గెటెడ్ ఆడియన్సుని నవ్విస్తుంది. తనెవరో తనకే తెలియని స్థితిలో తనలో తాను మాట్లాడుకుంటూ సత్య పంచే వినోదం ఆకట్టుకుంటుంది. అలాగే పక్క వ్యక్తులతో సంభాషణలో భాగంగా తట్టిన పదాలతో పదవినోదం పూర్తి చేసే పాత్రలో వెన్నెల కిషోర్ కూడా కొంత నవ్వించాడు. ఒక పాత్ర పక్కకు తప్పుకోమని చెబుతూ ‘‘మూవ్’’ అంటే.. ఇంకో పాత్ర ‘‘మూవ్ లేదు బర్నాల్ ఉంది’’ అనగానే.. వెన్నెల కిషోర్ ‘జబర్దస్త్’ అని పదవినోదంలో రాసుకోవడం.. ఇలాంటి సీన్లలో రితేష్ రాణా సెన్సాఫ్ హ్యూమర్ కనిపిస్తుంది. ఐతే అక్కడక్కడా ఇలాంటి కొన్ని మెరుపులు తప్పితే.. సినిమాలో కన్సిస్టెన్సీ మిస్ అయింది. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లు.. సన్నివేశాలు చూస్తే ఫన్నీగా అనిపించినా.. కథాకథనాలు మరీ బలహీనంగా ఉండడం వల్ల ఒక సినిమాగా మెప్పించడంలో ‘జెట్లీ’ విఫలమైంది.

జెట్లీలో సత్య సహా ఏ పాత్ర ఏంటో అర్థం చేసుకోవడమే పెద్ద సమస్యగా మారింది. చివరి వరకు ఏ పాత్ర మీదా ఒక అంచనాకు రాని విధంగా అన్నింటినీ అనుమానాస్పదంగా చూపించారు. చివరికి ఎవరి గురించీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ కన్ఫ్యూజన్ తప్పితే.. థ్రిల్ చేయడం ఏమీ ఉండదు. కామెడీ సినిమాల్లో లాజిక్కుల గురించి ఆలోచించకూడదన్నది వాస్తవమే కానీ.. ఇందులో కొన్ని సన్నివేశాలు మరీ విడ్డూరంగా అనిపిస్తాయి. కామెడీ కూడా పెద్దగా పండకపోవడంతో కథాకథనాలు.. పాత్రల్లోని గందరగోళం.. లాజిక్కులు లేని సీన్లు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి. ప్రథమార్ధం కొంత వరకు ఎంగేజ్ చేసినా.. ద్వితీయార్ధం పూర్తిగా నిరాశకు గురి చేయడంతో చివరికొచ్చేసరికి ‘జెట్లీ’ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రి క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి కాస్త పర్వాలేదనిపిస్తుంది. ముగింపు సన్నివేశాల్లో విషయం లేకుండా బాగా సాగదీసేశాడు రితేష్ రాణా. సినిమా ముగుస్తున్నా కూడా.. సత్య-వెన్నెల కిషోర్ పాత్రల తీరేంటో అర్థం కాని పరిస్థితి. చివర్లో ఒకప్పుడు చిరంజీవి డూప్ గా నటించిన రాజ్ కుమార్ ను తీసుకొచ్చి సత్య పాత్ర గురించి విపరీతమైన బిల్డప్ ఇప్పించారు. అసలా సన్నివేశం ఉద్దేశమేంటో అర్థం కాక తలలు పట్టుకుని థియేటర్ నుంచి బయటికి వచ్చే పరిస్థితి. మొత్తంగా చెప్పాలంటే ‘హ్యాపీ బర్త్ డే’ తరహాలోనే రితేష్ రాణా నుంచి వచ్చిన మరో మిస్ ఫైర్ ఫిలిం ‘జెట్లీ’.

నటీనటులు:

‘జెట్లీ’ని అంతో ఇంతో నిలబెట్టింది సత్యనే. తనకే సొంతమైన టిపికల్ కామెడీ టైమింగ్ తో అతను అదరగొట్టాడు. తన స్టైల్.. మేనరిజమ్స్.. కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఐయామ్ ద హీరో.. డన్ విత్ కామెడీ.. అంటూ అతను చేసిన హడావుడి నవ్విస్తుంది. తన గెటప్ కూడా బాగా కుదిరింది. వెన్నెల కిషోర్ ‘పదవినోదం’ కామెడీతో కొంత వరకు నవ్వించాడు కానీ.. తనను పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది. విలన్ పాత్రలో అజయ్ బాగానే చేసినా.. తన పాత్ర కూడా అంత బాగా లేదు. స్పెషల్ ఆఫీసర్ పాత్రలో రియా శర్మ పర్వాలేదు. ఆమె చూడ్డానికి బాగుంది. నటన ఓకే. తన పాత్రకు ఫరియా డబ్బింగ్ బాగానే కుదిరింది. గుండు సుదర్శన్ కామెడీ ఏమాత్రం పండలేదు. శ్రీనివాసరెడ్డిని కూడా సరిగా వాడుకోలేదు. కబీర్ సింగ్ దుల్హన్ బాగానే చేశాడు.

సాంకేతికవర్గం:

‘జెట్లీ’లో సాంకేతిక నిపుణుల పనితనం ఓకే అనిపిస్తుంది. పాటలు లేని సినిమాలో కాలభైరవ నేపథ్య సంగీతంతో కొంత వరకు మెప్పించాడు. రితేష్ రాణా శైలికి తగ్గట్లే అతను ఆర్ఆర్ ఇచ్చాడు. కానీ కొన్నిచోట్ల బీజీఎం లైట్ అవడంతో సినిమా మరీ డల్ అయిపోయిన భావన కలుగుతుంది. సురేష్ సారంగం ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్ బాగా చేశారు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక జయేంద్రతో కలిసి రితేష్ రాణా రాసిన కథలో పెద్దగా విషయం లేదు. స్క్రీన్ ప్లేతో మాయ చేయాలని చూసినా.. అది వర్కవుట్ కాలేదు. రితేష్ డైలాగులు మాత్రం ఆకట్టుకుంటాయి. తన రైటింగ్-టేకింగ్ లో తన సెన్సాఫ్ హ్యూమర్ కొన్ని చోట్ల కనిపించింది కానీ.. అందులో నిలకడ లేకపోయింది. సరైన కామెడీ సిచువేషన్లు క్రియేట్ చేయకపోవడంతో రితేష్ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు.

చివరగా: జెట్లీ.. కుదిపేశాడు

రేటింగ్ - 2.25/5

Tags:    

Similar News