2026 ఆస్కార్స్ రేసులో ఒకే ఒక్క భార‌తీయ సినిమా?

అవార్డుల కేట‌గిరీ సినిమా, క‌మ‌ర్షియ‌ల్ సినిమా.. ఇలా ముందే డిసైడ్ అయిపోతే ఏ గొడ‌వా ఉండ‌దు.;

Update: 2025-09-20 03:59 GMT

అవార్డుల కేట‌గిరీ సినిమా, క‌మ‌ర్షియ‌ల్ సినిమా.. ఇలా ముందే డిసైడ్ అయిపోతే ఏ గొడ‌వా ఉండ‌దు. అలా ఫిక్స‌యిపోయారు కాబ‌ట్టే 'హోమ్ బౌండ్' నిర్మాత‌లు మొద‌టి నుంచి భార‌త‌దేశం వెలుప‌ల‌, అంత‌ర్జాతీయ ఫిలింఫెస్టివ‌ల్స్ లో ఎక్కువగా క‌నిపించ‌డం ప్రారంభించారు. అక్క‌డ త‌మ సినిమా `హోమ్ బౌండ్` ని కావాల్సినంత‌గా ప్ర‌మోట్ చేసుకున్నారు. చూస్తుంటే, ఇప్పుడు ఈ సినిమాని ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్ లో ప్ర‌చారం చేసుకున్నందుకు స‌రైన ప్ర‌తిఫ‌లం ద‌క్కుతున్న‌ట్టే అనిపిస్తోంది.

జాన్వీక‌పూర్, ఇషాన్ ఖ‌త్త‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన 'హోమ్‌బౌండ్' సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) 2026 ఆస్కార్ అవార్డుల ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. క‌ర‌ణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కి ఇది ఉత్త‌మ ఫ‌లితం అని భావించాలి.

తాను నిర్మించిన సినిమా ఆస్కార్స్ నామినేష‌న్ కి వెళుతుండ‌డంతో క‌ర‌ణ్ జోహార్ ఆనందానికి అవ‌ధుల్లేవ్. ద‌ర్శ‌కుడు నీర‌జ్ ఘ‌య్వాన్ కూడా చాలా ఆనందం వ్య‌క్తం చేసారు. ఇది త‌మ‌కు చాలా గౌర‌వాన్ని పెంచింద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంతోషించారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడి ప‌నిత‌నంపై క‌ర‌ణ్ మొద‌టి నుంచి న‌మ్మ‌కంగా ఉన్నారు. అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప పేరొస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని కూడా ఆయ‌న‌ వ్య‌క్తం చేసారు.

మ‌న భూమి.. మ‌న ప్ర‌జ‌లకు చెందిన‌ క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందించామ‌ని ద‌ర్శ‌కుడు ఈ సంద‌ర్భంగా తెలిపారు. మ‌న క‌థ‌ల‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ల‌డం.. ప్ర‌పంచ వేదిక‌ల‌పై ప్ర‌జల్ని అల‌రించ‌డం భార‌తీయ సినిమాకి గ‌ర్వ‌కార‌ణమ‌ని భావిస్తున్నట్టు తెలిపారు. ఆస్కార్స్ కి వెళుతున్నాం అని తెలియ‌గానే, ఈ సినిమాలోని ప్రతి భాగం ఒక కల లాంటిది అంటూ జాన్వీ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. మా టీమ్ లోని ప్ర‌తి ఒక్క‌రికీ వ్య‌క్తిగ‌తంగా క‌నెక్ట‌యిన చిత్ర‌మిది. జీవితం అనే ఆశ‌, ప్ర‌యాణం గురించిన సినిమా ఇద‌ని జాన్వీ తెలిపింది.

హోమ్‌బౌండ్ ఇటీవల 50వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శిత‌మైంది. ఈ వేడుక‌ల్లో ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో రెండవ రన్నరప్‌గా ప్రకటించారు. సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలోను సినిమా విడుదల కానుంది. ఈ స‌మ‌యంలో ఆస్కార్ నామినేష‌న్ కి వెళుతుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇది బాక్సాఫీస్ వ‌సూళ్ల‌కు స‌హ‌క‌రిస్తుంద‌నే ఆశిద్దాం.

Tags:    

Similar News