హాలీవుడ్, బాలీవుడ్ కలయిక...!
తాజాగా అజయ్ దేవగన్‌తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించాడు. అభిమానులను ఉత్సాహపరిచే విధంగా త్వరలోనే అజయ్ దేవగన్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.;
జాకీ చాన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తన యాక్షన్‌తో మెప్పించేందుకు రెడీ అయ్యాడు. మే 30వ తారీకున 'కరాటే కిడ్స్ : లెజెండ్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఇండియాలో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌తో ప్రమోట్ చేయించారు. జాకీచాన్ తాజాగా అజయ్ దేవగన్‌తో కలిసి సందడి చేసిన ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో జాకీచాన్, అజయ్ దేవగన్‌లు సరదాగా మాట్లాడుకున్న మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో బాలీవుడ్‌లో కుంగ్‌ఫూ యోగా సినిమాలో జాకీ చాన్ నటించడం ద్వారా హిందీ ప్రేక్షకులకు చేరువ అయిన విషయం తెల్సిందే.
తాజాగా అజయ్ దేవగన్‌తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించాడు. అభిమానులను ఉత్సాహపరిచే విధంగా త్వరలోనే అజయ్ దేవగన్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు తెగ సంబర పడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అభిమానులు జాకీచాన్ మరోసారి ఇండియన్ సినిమాలో కనిపిస్తే కచ్చితంగా సూపర్ హిట్‌ను అందించడం ఖాయం. కనుక అజయ్ దేవగన్‌తో వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సినిమాను మొదలు పెట్టాలని, ఆ సినిమాలో జాకీ చాన్ ఉండాలని అంతా బలంగా కోరుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కామన్‌గా కనిపిస్తున్నారు. అయితే జాకీ చాన్ వంటి హాలీవుడ్ స్టార్ ఇండియన్ సినిమాలో కనిపించడం అనేది కచ్చితంగా అరుదైన విషయంగా చెప్పుకోవాలి. అందుకే కుంగ్ ఫూ యోగా సినిమాకు మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ యాక్షన్ సినిమాగా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే తప్పకుండా అది ఇండియాలో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి. జాకీ చాన్ సినిమా అనగానే వినోదం కూడా మెండుగా ఉంటుంది. అందుకే కరాటే కిడ్స్ : లెజెండ్స్ సినిమా కోసం ఇండియాలో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
కరాటే కిడ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కరాటే కిడ్స్ : లెజెండ్స్ సినిమాపై యాక్షన్ సినిమా ప్రియుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కామెడీతో పాటు యాక్షన్ సమపాళ్లలో ఉండటంతో కచ్చితంగా అభిమానులను మెప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జాకీ చాన్ ఏడు పదుల వయసులోనూ చాలా యాక్టివ్‌గా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. సాధారణంగా అయిదు పదుల వయసులోనే హీరోలు యాక్షన్ సన్నివేశాలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది ఏడు పదుల వయసులో జాకీ చాన్ యాక్షన్ సన్నివేశాలను అలవోకగా చేస్తూ ప్రపంచ యాక్షన్ ప్రియులను అలరిస్తూ నవ్విస్తూ వస్తున్నాడు. అలాంటి జాకీ చాన్ మరోసారి ఇండియన్ సినిమాపై తన ముద్ర వేస్తాడేమో చూడాలి.