పాక్ కు షాక్... 10 మంది సైనికుల హతం!

మరోపక్క జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకలపై భారత భద్రతా బలగాల తుపాకులు గర్జిస్తున్నాయి.;

Update: 2025-04-26 03:58 GMT

పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. ఈ క్రమంలో పాక్ సైన్యం వరుసగా రెండోరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ (ఎల్.ఓ.సీ) వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అయితే.. దీన్ని భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది.

మరోపక్క జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకలపై భారత భద్రతా బలగాల తుపాకులు గర్జిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం గాలిస్తున్న నేపథ్యంలో బాందీపొరలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. మరోపక్క పాక్ కు స్వదేశంలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ షాకిచ్చింది.

అవును... భారతదేశంతో యుద్ధం తప్పదని భావిస్తున్న వేళ పాకిస్థాన్ కు స్వదేశంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీ.ఎల్.ఏ) గట్టి షాకిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం క్వెట్టాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) దాడిలో పది మంది పాకిస్థాన్ సైనిక సిబ్బంది మరణించారు. ఇది పాక్ కు ఈ సమయంలో గట్టి దెబ్బని అంటున్నారు.

క్వెట్టా శివారు ప్రాంతమైన మార్గట్ లో పాకిస్థాన్ సైనిక కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ దాడికి బీ.ఎల్.ఏ. బాధ్యత వహించింది. తమ సైనికులు రిమోట్ కంట్రోల్డ్ డివైజ్ ను ఉపయోగించి ఆర్మీ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. ఈ పేలుడు శత్రు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని వెల్లడించింది.

ఈ దాడిలో 10 మంది పాకిస్థాన్ సైనిక సిబ్బంది మరణించారని బీ.ఎల్.ఏ. ప్రతినిధి జియాంద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో.. రాబోయే రోజుల్లో పాక్ సైన్యానికి వ్యతిరేకంగా తమ కార్యకలాపాలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. స్వాతంత్రం కోసం తమ పోరాటం ఆగదని.. తమ శక్తి మేరకు శత్రువును లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా... గురువారం బలుచిస్తాన్ లో జరిగిన వేర్వేరు దాడుల్లో బీ.ఎల్.ఏ. ఏడుగురు పాకిస్థాన్ సైనికులను చంపింది. ఈ దాడుల్లో నలుగురు పాక్ సైనికులు గాయపడినట్లు తెలిపింది. ఈ దాడులు జమురాన్, కోల్వా, కలాట్ జిల్లాల్లో జరిగాయి.

Tags:    

Similar News