ఇండో - కొరియన్ కథల హవా పెరుగుతోందా?
కొరియన్ డ్రామా `ఫ్లవర్ ఆఫ్ ఈవిల్` కి అఫీషియల్ హిందీ రీమేక్ గా డ్యూరాంగా వచ్చింది. హన్సిక నటించిన MY3 సిరీస్ కొరియన్ డ్రామా `ఐ యామ్ నాట్ ఏ రోబోట్`కు అనుకరణ.;
ఇండో కొరియన్ సినిమా.. ఇటీవలి కాలంలో దక్షిణాది చిత్రసీమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇటీవల తమిళం, తెలుగు సినీ పరిశ్రమల్లో కొరియన్ నటులతో, కొరియన్ టెక్నీషియన్లతో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు... ఇండో- కొరియన్ నేపథ్యాలు కలిసిన సినిమాల వెల్లువ కూడా మొదలవుతోంది. దీనిని మూడు రకాలుగా వర్గీకరిస్తే, కొరియాలో చిత్రీకరించినవి, కొరియన్ కథల ఆధారంగా రీమేక్ అయినవి, ఇండియన్- కొరియన్ క్రాస్ ఓవర్ కథలతో వస్తున్న చిత్రాలుగా దీనిని చూడాలి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `కోక` కొరియన్ బ్యాక్‌డ్రాప్, కామెడీ హారర్ కలయికలో రూపొందుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఇండో-కొరియన్ సినిమాల గురించి చర్చ సాగుతోంది.
కొరియన్ నేపథ్యంలో మూడు రకాల సినిమాలు మనవాళ్లు రూపొందిస్తున్నారు. కొరియా అందాలను, అక్కడి సంస్కృతిని చూపించే సినిమాలు ఒక కేటగిరీ. కొరియన్ లొకేషన్లలో షూట్ లు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ తమిళ చిత్రం `మేడ్ ఇన్ కొరియా`తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా సియోల్ (కొరియా రాజధాని) వీధుల్లో జరిగింది. ఒక భారతీయ అమ్మాయి కొరియాకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే భాషా సమస్యలు, అక్కడి స్నేహాలు, ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో `స్క్విడ్ గేమ్` నటుడు పార్క్ హ్యే-జిన్ కూడా నటించడం విశేషం. కొరియా- ఇండియలను ముడిపెట్టే కథాంశం ఇది. అలాగే కొరియన్ కథలను రీమేక్ చేయడం కూడా ఇటీవల చూస్తున్నాం. ఇది మూడో కేటగిరీ.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన `గ్యాంగ్ స్టర్` మూవీలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటలు దక్షిణ కొరియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. కొరియన్ సినిమాల ఆధారంగా వచ్చిన రీమేక్ లలో కొరియన్ కథలను భారతీయ నేటివిటీకి మార్చి తీసిన సినిమాలు చాలా ఉన్నాయి.
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇది కొరియన్ సినిమా `మిస్ గ్రానీ`కి అఫీషియల్ తెలుగు రీమేక్. నివేదా థామస్, రెజీనా నటించిన `శాకిని డాకిని` చిత్రం కొరియన్ సినిమా `మిడ్నైట్ రన్నర్స్`కి రీమేక్.
సల్మాన్ ఖాన్ నటించిన `భారత్` సినిమా కొరియన్ హిట్ `ఓడ్ టు మై ఫాదర్` ఆధారంగా తీశారు. కొరియన్ థ్రిల్లర్ `ఐ సా ద డెవిల్` స్పూర్తితో తీసిన చిత్రం- ఏక్ విలన్. కార్తీక్ ఆర్యన్ ధమాకా `ద టెర్రర్ లైవ్` అనే చిత్రానికి రీమేక్. తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ 2 కథలో ఇన్వెస్టిగేషన్ స్టైల్ చూస్తే, కొన్ని కొరియన్ థ్రిల్లర్ల ఛాయలు కనిపిస్తాయి. ఐశ్వర్యరాయ్ నటించిన జజ్బా చిత్రం కొరియన్ డ్రామా `సెవెన్ డేస్`కి రీమేక్.
వెబ్ సిరీస్‌లు కూడా వచ్చాయి:
కొరియన్ డ్రామా `ఫ్లవర్ ఆఫ్ ఈవిల్` కి అఫీషియల్ హిందీ రీమేక్ గా డ్యూరాంగా వచ్చింది. హన్సిక నటించిన MY3 సిరీస్ కొరియన్ డ్రామా `ఐ యామ్ నాట్ ఏ రోబోట్`కు అనుకరణ. ఇలా చెప్పుకుంటూ వెళితే మునుముందు ఇంకా గ్రాఫ్ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు.