బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్: షారుఖ్ 'కింగ్' వర్సెస్ యష్ 'టాక్సిక్'
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగినప్పటి నుండి భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ మరింత రసవత్తరంగా మారింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగినప్పటి నుండి భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ మరింత రసవత్తరంగా మారింది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం... త్వరలోనే ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాష్‌కు తెరలేవబోతోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కింగ్, శాండల్‌వుడ్ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్` ఒకే విడుదల తేదీని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు ఒకే సమయంలో పోటీ పడితే అది ఇటీవల కాలంలోనే అతిపెద్ద బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా యుద్ధంగా మారడం ఖాయం.
ఈ ఇద్దరు అగ్ర కథానాయకుల చిత్రాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ అనగానే సినీ ప్రియులకు గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. 2018 డిసెంబర్‌లో షారుఖ్ ఖాన్ భారీ బడ్జెట్ చిత్రం `జీరో` విడుదలైన సమయంలోనే యష్ నటించిన కన్నడ సంచలనం `కేజీఎఫ్: చాప్టర్ 1` కూడా థియేటర్లలోకి వచ్చింది. ఆ సమయంలో బాలీవుడ్ మార్కెట్‌లో సైతం షారుఖ్ చిత్రానికి గట్టి పోటీ ఇస్తూ వసూళ్ల పరంగా `కేజీఎఫ్` స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఆనాటి క్లాష్‌లో యష్ నార్త్ బెల్ట్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకోగా షారుఖ్ ఖాన్ జీరో డిజాస్టరైంది. అయితే ఆ తర్వాత పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించి మళ్లీ తన పూర్వ వైభవాన్ని కింగ్ హోదాను చాటుకున్నారు. మరోవైపు `కేజీఎఫ్ 2` తో యష్ గ్లోబల్ స్థాయిలో తన మార్కెట్‌ను ఊహించని రేంజుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ తమ సరికొత్త ప్రాజెక్టులైన కింగ్ - టాక్సిక్ చిత్రాలతో తలపడనుండటం సహజంగానే అటు అభిమానుల్లో, ఇటు వ్యాపార వర్గాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `టాక్సిక్` చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇదొక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపుదిద్దుకుంటోంది. అదే సమయంలో షారుఖ్ ఖాన్ `కింగ్` చిత్రం కూడా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో ఖాన్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారని టాక్ ఉంది. ఈ రెండు సినిమాలు కూడా కంటెంట్ పరంగా, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ ఇరు చిత్రాల క్లాష్ గురించిన రూమర్స్ రావడంతో ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. ఈసారి బాక్సాఫీస్ రేసులో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై నెటిజన్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. షారుఖ్ తన సుదీర్ఘ అనుభవంతో మళ్లీ పుంజుకున్న మార్కెట్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని బాలీవుడ్ వర్గాలు నమ్ముతుండగా, యష్ తన మాస్ పవర్‌తో సౌత్ దెబ్బేంటో మరోసారి రుచి చూపిస్తారని సౌత్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ అల్టిమేట్ పాన్-ఇండియా క్లాష్ అధికారికంగా ఖరారైతే గనుక థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ పోటెత్తడం ఖాయం.