నవ్వుల దాడికి శ్రీను వైట్ల రెడీ.. జార్జ్ క్రిష్ తో హిట్ ట్రాక్‌లోకి?
టాలీవుడ్‌లో ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ శ్రీను వైట్ల మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ శ్రీను వైట్ల మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరుస సక్సెస్‌లతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన గత కొన్నేళ్లుగా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. ముఖ్యంగా ఆయన్నుంచి ఆఖరిగా వచ్చిన విశ్వం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ జార్జ్ క్రిష్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా జులై మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను ముందు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని చెప్పారు కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ చేతులు మారి అనిల్ సుంకర చేతిలోకి వెళ్లింది. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం జార్జ్ క్రిష్ కథలో వినోదంతో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందట.
చిన్న వయసులో హీరో చేసిన పొరపాటు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం చుట్టూ కథ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ కథలో శర్వానంద్ పాత్రకు విభిన్నమైన షేడ్స్ ఉండనున్నాయని, అందుకే ఆయన కూడా వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మూవీలో 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ సినిమా ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం శ్రీను వైట్ల వింటేజ్ కామెడీ బ్రాండ్ రిటర్న్ కావడమే. ఢీ, రెడీ, దూకుడు, బాద్‌షా వంటి సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వైట్ల, గత కొంతకాలంగా ఆ మ్యాజిక్‌ను తిరిగి అందించలేకపోయారు. కానీ జార్జ్ క్రిష్ లో మాత్రం తన వింటేజ్ కామెడీ ట్రాక్‌లు, క్యారెక్టర్ బేస్డ్ హ్యూమర్, ఎంటర్టైన్మెంట్ సీన్స్ కు పెద్దపీట వేసినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో కూడా ఈ సినిమా పట్ల ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇదే సమయంలో షూటింగ్ ప్లానింగ్ కూడా వేగంగా జరుగుతోంది. జులైలో ప్రారంభమయ్యే తొలి షెడ్యూల్‌లో ఓపెనింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరించనుండగా, ఆగస్టులో జరగనున్న రెండో షెడ్యూల్‌లో హీరో- హీరోయిన్లపై కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే జార్జ్ క్రిష్ కేవలం మరో సినిమా మాత్రమే కాదు. ఇది శ్రీను వైట్ల కెరీర్‌కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. వింటేజ్ కామెడీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా సక్సెస్ అయితేనే శ్రీను వైట్లకు మరోసారి టాలీవుడ్‌లో బిజీ డైరెక్టర్‌గా కొత్త ఊపు రావడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.