దాడి చేసాడంటూ 'ఛత్రపతి' విలన్‌పై PSలో ఫిర్యాదు
బాధిత క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తాను ఒక ట్రిప్ పూర్తి చేసుకుని మరో బుకింగ్ కోసం నాగారంలోని రోడ్డు పక్కన వేచి చూస్తున్నట్లు తెలిపారు.
టాలీవుడ్ లో తనదైన నటనతో విలన్ పాత్రలకు గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సుప్రీత్ రెడ్డి (క్యాట్రాజ్) తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగారం పరిధిలో ఒక క్యాబ్ డ్రైవర్‌పై ఆయన భౌతిక దాడికి పాల్పడినట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. రోడ్డు పక్కన కారు ఆపిన విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ చినికి చినికి గాలివానగా మారి... చివరకు పోలీస్ కేసు వరకు వెళ్లడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధిత క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తాను ఒక ట్రిప్ పూర్తి చేసుకుని మరో బుకింగ్ కోసం నాగారంలోని రోడ్డు పక్కన వేచి చూస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో నటుడు సుప్రీత్ రెడ్డి తన వాహనంలో అక్కడికి వచ్చారని.. తన కారుకు అడ్డుగా ఉన్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. తాను కారు తీసే లోపే సుప్రీత్ తీవ్ర దుర్భాషలాడుతూ.. తనను నడిరోడ్డుపైనే చితకబాదారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నటుడు సుప్రీత్ రెడ్డికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుమారు 80కి పైగా చిత్రాలలో నటించిన సుదీర్ఘ అనుభవం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన `సై` చిత్రంలో రగ్బీ ప్లేయర్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో మంచి బ్రేక్ అందుకున్న అతడు.. ఆ తర్వాత అదే దర్శకుడి `ఛత్రపతి` చిత్రంలో పోషించిన `క్యాట్రాజ్` పాత్రతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ విలన్‌గా మారిపోయారు. అలాగే `మర్యాద రామన్న` చిత్రంలోనూ ఆయన పోషించిన పవర్‌ఫుల్ విలన్ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది.
తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సుప్రీత్ తనదైన ముద్ర వేశారు. అమీర్ ఖాన్ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం `గజిని` లో ఒక ముఖ్యమైన విలన్ అనుచరుడి పాత్రలో మెరిసిన ఆయన.. ఆ తర్వాత `విక్రమార్కుడు` హిందీ రీమేక్ `రౌడీ రాథోడ్`(అక్షయ్) చిత్రంలోనూ నెగెటివ్ పాత్రలో నటించి ఉత్తరాది ప్రేక్షకులను సైతం అలరించారు. వ్యక్తిగతంగా సీనియర్ నటులు మోహన్ బాబు, కోట శ్రీనివాసరావుల నటనను అమితంగా ఇష్టపడే సుప్రీత్.. పలు చిత్రాలలో సహాయ నటుడిగా కూడా మెప్పించారు.
సినిమాల్లో విలన్‌గా ఎంత రౌద్రం ప్రదర్శించినా.. నిజజీవితంలో భార్య ప్రియాంక, ఇద్దరు కుమారులతో కలిసి ఆయన ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఒక్కసారిగా నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌తో జరిగిన ఈ ఘర్షణ.. పోలీస్ కేసు అతడి ఇమేజ్‌కు కొంత ఇబ్బందికరమైనది. ఈ దాడి ఉదంతంపై సుప్రీత్ రెడ్డి వర్గం నుండి పూర్తి వివరణ రావాల్సి ఉందని, ఇరువర్గాల వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.