భార‌త‌దేశం నుంచి ఆస్కార్ గెలిచే ద‌ర్శ‌కుడు?

భార‌త‌దేశం నుంచి ఆస్కార్ గెలుచుకునే ద‌ర్శ‌కుడు ఎవరైనా ఉన్నారా? అంటే... స‌మాధానం చెప్ప‌డం అంత సులువు కాదు.;

Update: 2025-07-28 18:56 GMT

భార‌త‌దేశం నుంచి ఆస్కార్ గెలుచుకునే ద‌ర్శ‌కుడు ఎవరైనా ఉన్నారా? అంటే... స‌మాధానం చెప్ప‌డం అంత సులువు కాదు. భార‌త‌దేశానికి మొట్ట మొద‌టి ఆస్కార్ ని అందించిన ఘ‌న‌త మాత్రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి ద‌క్కుతుంది. ఆయ‌న తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని `నాటు నాటు..` ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ పుర‌స్కారాన్ని భార‌త‌దేశానికి అందించింది.

అయితే `ఉత్త‌మ ద‌ర్శ‌కుడు`గా రాజ‌మౌళి ఆస్కార్ ని గెలుచుకోలేరా? అంటే...ఈ ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం చెప్ప‌డం సులువు కాదు. అయితే భార‌త‌దేశంలో ఆస్కార్ గెలుచుకునే ద‌ర్శ‌కుడు ఎవ‌రున్నారు? అని ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రాని ప్ర‌శ్నిస్తే ఆయ‌న‌ ఇచ్చిన జ‌వాబు ఆశ్చ‌ర్య ప‌రిచింది. భార‌త‌దేశంలో ఆస్కార్ ని అందించ‌గ‌లిగే సామ‌ర్థ్యం బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణీకి ఉంద‌ని ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. రాజు స‌ర్ క‌థ‌లు సార్వ‌జ‌నీన‌మైన‌వి. భావోద్వేగాల్ని పండించ‌గ‌లిగేవి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌నెక్టివిటీని క‌లిగి ఉన్న‌వి. దేశంలో ఎవరైనా అకాడమీ అవార్డును తీసుకువచ్చే అవకాశం ఉంటే అది `రాజు హిరాణీ సర్` అని ఛాబ్రా పేర్కొన్నారు. హిరాణీ తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రాలు పీకే- సంజు స‌హా ఇత‌ర చిత్రాల‌కు చాబ్రా కాస్టింగ్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసారు. అత‌డు హిరాణీ ని చాలా ద‌గ్గ‌ర‌గా, ప్ర‌త్య‌క్షంగా చూసిన అనుభ‌వంతో ఈ విష‌యాల‌ను వివ‌రించారు. హిరాణీ ఒక ఫిలింస్కూల్. ఫిలింమేకింగ్ డీటెయిలింగ్ లో హిరాణీ నిబ‌ద్ధ‌త‌, అపార జ్ఞానం ఆయ‌న‌ను అత్యుత్త‌మ ద‌ర్శ‌కుల జాబితాలో నిల‌బెడ‌తాయ‌ని కూడా చాబ్రా అభిప్రాయ‌ప‌డ్డారు.

తాను తెర‌కెక్కించే ప్ర‌తి పాత్ర‌తో తెర‌పై ప్ర‌మాణాలు నెల‌కొల్పేందుకు హిరాణీ చాలా కాలం త‌న‌ను వెయిట్ చేయించేవార‌నే విష‌యాన్ని కూడా ముఖేష్ చాబ్రా గుర్తు చేసుకున్నారు. పాత్ర‌ల‌కు స‌రితూగే పాత్ర‌ధారుల ఎంపిక కోసం రాజు స‌ర్ సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి అన్వేషిస్తార‌ని తెలిపారు. అత‌డి సినిమాల్లో హృద‌యాన్ని హ‌త్తుకునే ఎలిమెంట్స్, హాస్యం, సామాజిక అవ‌గాహ‌న‌, సెటైర్ వంటివి ప్ర‌పంచ‌వ్యాప్త ఆడియెన్ కి క‌నెక్ట‌వుతాయ‌ని కూడా ముఖేష్ చాబ్రా అభిప్రాయ ప‌డ్డారు.

నిజానికి హిరాణీ తెర‌కెక్కించిన సినిమాలు వేటిక‌వే భిన్న‌మైన‌వి. ఆయ‌న విభిన్న‌మైన సంస్కృతుల‌ను, సమాజాల‌ను అధ్య‌య‌నం చేసి సినిమాల‌ను రూపొందిస్తారని చాబ్రా విశ్లేషించారు. అయితే రాజ్ కుమార్ హిరాణీ పై ఇది ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే. దీని అర్థం.. రాజ‌మౌళి కానీ, సుకుమార్ లేదా పాండి రాజ్, నితీష్ తివారీ, కిర‌ణ్ రావు వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు భార‌త‌దేశానికి ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ఆస్కార్‌ని అందించ‌లేరు అని ఆయ‌న ఎక్క‌డా చెప్ప‌లేదు.

ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ, పెట్టుబ‌డి ముఖ్యం:

ఆర్.ఆర్.ఆర్ నాటు నాటుకు ఆస్కార్ ద‌క్కింది అంటే .. దాని వెన‌క ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ, ఆర్థిక హార్థిక క‌ష్టాల గురించి కూడా మాట్లాడుకున్నారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కావాల‌ని క‌ల‌లు కంటే స‌రిపోదు.. దానికి త‌గ్గ‌ట్టు ఆస్కార్స్ కి ఓటింగ్ లో నెగ్గుకొచ్చేందుకు ప్ర‌మోష‌న్స్, త‌డిసి మోపెడు అయ్యేలా కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేయాలనేది ఎవ‌రూ మ‌ర్చిపోకూడ‌దు. అకాడెమీ జూరీని మెప్పించేలా ప్ర‌చార‌క‌ర్త‌ల‌కు క‌మీష‌న్లు గ‌ట్రా ఇస్తూ, హాలీవుడ్ మీడియాకు తాయిలాలు అందిస్తూ, ఎవ‌రు ఎక్కువ పాకులాడుతారో వారికి మాత్ర‌మే ఆస్కారం ద‌క్కే ఛాన్సుంటుంద‌ని కూడా ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి.

Tags:    

Similar News