9 నెలల క్రితం మిస్సింగ్.. ఫ్లాట్ లో కుళ్లిన పాక్ నటి మృతదేహం.. ఈ క్రైం ఎపిసోడ్ లో ఏం జరిగింది?
పాకిస్థాన్ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి హుమైరా అస్గర్ అలీ మరణవార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.;
పాకిస్థాన్ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి హుమైరా అస్గర్ అలీ మరణవార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు తొమ్మిది నెలలుగా కరాచీలోని తన నివాసంలో కుళ్లిపోయిన స్థితిలో ఆమె మృతదేహం ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. ఇంటి యజమాని అద్దె రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
-చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
హుమైరా అస్గర్ చివరిసారిగా 2024 సెప్టెంబర్ 30న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆమె ఆరెంజ్ సల్వార్ సూట్‌లో కనిపించి “Classic can hardly ever go out of style!!” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానులు ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె చివరి పోస్ట్ ఇదే కావడం మరింత బాధను కలిగిస్తోంది.
-ఇల్లు ఖాళీ, విద్యుత్ లేని జీవితం
పోలీసుల కథనం ప్రకారం.. హుమైరా అస్గర్ 2024 అక్టోబర్‌లో మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ నెల నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం, ఇంట్లో ఎలాంటి ఆహార పదార్థాలు లేకపోవడం వల్ల ఆమె ఒంటరిగా, బాధతో జీవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆమె నివసిస్తున్న అంతస్తులో ఎవరూ ఉండకపోవడం, బాల్కనీలో ఒక తలుపు మాత్రమే తెరిచి ఉండటం వల్ల దుర్వాసన బయటకు రాలేదని పోలీసులు చెప్పారు. అద్దె రాకపోవడంతో యజమాని ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ మృతదేహం బయటపడింది.
-కుటుంబానికి దూరం.. ఒంటరితనంలో జీవితం
హుమైరా అస్గర్ 2015లో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 'జస్ట్ మ్యారీడ్', 'ఎహసాన్ ఫరామోష్', 'గురు', 'చల్ దిల్ మేరే' వంటి టీవీ షోలలో నటించారు. 2015లో 'జలైబీ', 2021లో 'లవ్ వ్యాక్సిన్' సినిమాల్లో కనిపించారు. 2022లో ARY డిజిటల్ ఛానెల్‌లో ప్రసారమైన 'తమాషా ఘర్' అనే రియాలిటీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో 'బెస్ట్ ఎమర్జింగ్ టాలెంట్ & రైజింగ్ స్టార్' అవార్డు కూడా పొందారు.
2017లో లాహోర్ నుంచి కరాచీకి మకాం మార్చిన హుమైరా, చివరి రెండేళ్లుగా కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదు. ఆమె తండ్రి మృతదేహాన్ని కరాచీలోనే సమాధి చేయాలని సూచించారు.
ప్రస్తుతం పోలీసులు హుమైరా అస్గర్ మొబైల్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. చివరి కాల్ అక్టోబర్‌లో జరిగినట్లు సమాచారం. అందువల్ల ఆమె అక్టోబర్‌లోనే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఇన్ని నెలలుగా ఆమె గురించి ఎవరూ పట్టించుకోకపోవడం, కుటుంబ సభ్యులు విచారించకపోవడం స్థానికులను, విచారణాధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
-మరణించిన తర్వాత గుర్తింపు లభించడం ఓ విషాదం
ఒకప్పుడు వెలుగులో మెరిసిన నటి.. చివరికి ఒంటరిగా, గుర్తింపు లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది. ఆమె మరణం సినీ ప్రపంచంలో, సోషల్ మీడియాలో, ఒంటరితనం ఎదుర్కొంటున్న సెలబ్రిటీల జీవితాలపై ఆలోచనను రేకెత్తిస్తోంది. హుమైరా అస్గర్ మరణం సినీ ప్రపంచానికి, అభిమానుల హృదయాలకు చిరకాలం గుర్తుండిపోయే విషాద ఘటనగా మిగిలిపోనుంది.