ఆస్కార్ ఎంట్రీ మూవీకి కాపీ చిక్కులు!
ఆస్కార్ రేసులో నిలిచి అకాడమీ అవార్డుని దక్కించుకోవాలని ప్రతి టెక్నీషియన్ ఆశగా ఎదురు చూస్తుంటారు.;
ఆస్కార్ రేసులో నిలిచి అకాడమీ అవార్డుని దక్కించుకోవాలని ప్రతి టెక్నీషియన్ ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి ఆశతో ఆస్కార్ ఎంట్రీకి అర్హత సాధించింది ఇండియన్ మూవీ `హోమ్‌బౌండ్`. ఇషాన్ కట్టర్, విశాల్ జత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్, ఆదార్ పూనావాలా మరోముగ్గురు కలిసి నిర్మించారు. ఈ ఏడాది మే 25న కేన్స్‌లో ప్రదర్శించిన ఈ మూవీని సెప్టెంబర్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
భారత్ తరుపున 2026 ఆస్కార్ కోసం పోటీపడుతున్న ఈ మూవీపై తాజాగా వివాదం మొదలైంది. ఆస్కార్ ఎంట్రీ సాధించిన `హోమ్‌బౌండ్`పై ఓ రచయిత్రి సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. తన నవలను కాపీ కొట్టి ఈ సినిమా తీశారంటూ రచయిత్రి పూజా చంగోయివాలా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో ఆమె `హోమ్‌బౌండ్` దర్శకనిర్మాతలపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. 2021లో `హోమ్‌బౌండ్` పేరుతో తాను ఓ నవలని రాశానని, ఈ సినిమా టైటిల్ దగ్గరి నుంచి ఇందులోని పాత్రల వరకు అన్నీ తన నవలనే పోలి ఉన్నాయని ఆమె ఆరోపించారు.
అక్టోబర్ 15న నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేశానని, అయితే వాటికి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో తాను న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ఆమె చెబుతున్నారు. రచయిత్రి పూజా ఆరోపణలపై `హోమ్‌బౌండ్` నిర్మాణ సంస్థ స్పందించింది. మేము చట్టపరంగా సమాధానం ఇస్తాం. ఇప్పుడు దీని గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేం` అని స్పష్టం చేసింది.
ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని ప్రదర్శించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. అనంతరం చిత్ర బృందం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ ఆర్టికల్ ఆధారంగా ఈ మూవీని రూపొందించామని వెల్లడించారు. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండో రన్నరప్‌గా నిలిచి ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. ఇదే ఊపుతో వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది.
బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీపడి ఇటీవల విడుదల చేసిన షార్ట్ లిస్ట్ జాబితాలో స్థానం దక్కించుకుని భారతీయ ప్రేక్షకుల్లో ఆస్కార్ ఆశల్ని రేకెత్తించింది. వచ్చే ఏడాది విదేశీ చిత్రాల విభాగంలో `హోమ్‌బౌండ్` ఆస్కార్ సాధిస్తే జాన్వీ కపూర్ ఖాతాలో ఆస్కార్ మూవీ చేరడం ఖాయం అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పోలీసు కావాలనే కలని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుల,మత వివక్షకు వ్యతిరేకంగా ఇద్దరు స్నేహితులు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఇండియన్ ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.