బాక్సాఫీస్: ధూరందర్ vs పుష్ప 2.. తేడా ఎలా ఉందంటే..
నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాల హవాను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నట్లుగా సాగిన 'పుష్ప 2' ప్రభంజనానికి ఎట్టకేలకు ఒక బాలీవుడ్ సినిమా బ్రేక్ వేసింది;
నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాల హవాను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నట్లుగా సాగిన 'పుష్ప 2' ప్రభంజనానికి ఎట్టకేలకు ఒక బాలీవుడ్ సినిమా బ్రేక్ వేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన రికార్డులను అధిగమించడం అసాధ్యమని అంతా భావిస్తున్న తరుణంలో, రణవీర్ సింగ్ తన 'ధూరందర్' చిత్రంతో అద్భుతాన్ని చేసి చూపించారు. హిందీ బెల్ట్‌లో నెట్ వసూళ్ల పరంగా ఒక రికార్డ్ ని అధిగమిస్తూ, ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు.
నిజానికి 'పుష్ప 2' విడుదలైన మొదటి వారంలో సృష్టించిన రికార్డులు కనీవినీ ఎరుగనివి. కానీ 'ధూరందర్' విషయంలో లాంగ్ రన్ అనేది గేమ్ ఛేంజర్‌గా మారింది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, కేవలం 7 వారాల్లోనే ధూరందర్ చిత్రం పుష్పరాజ్ లైఫ్ టైమ్ హిందీ వసూళ్లను స్వల్ప మార్జిన్‌తో దాటేసింది. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ధూరందర్ చిత్రానికి బ్రహ్మరథం పట్టడమే ఈ విజయానికి ప్రధాన కారణం.
వసూళ్ల గణాంకాలను గమనిస్తే, 'పుష్ప 2' ఓపెనింగ్ వీక్ లో ఏకంగా రూ. 425 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఆ సమయంలో ధూరందర్ కేవలం రూ. 207 కోట్లు మాత్రమే సాధించింది. అయితే, రెండో వారం నుండి కథ పూర్తిగా మారిపోయింది. అల్లు అర్జున్ సినిమా కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ రాగా, రణవీర్ సింగ్ సినిమా మాత్రం రెండో వారంలో అంతకంటే ఎక్కువ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడి నుండి ప్రతి వారం స్థిరమైన వసూళ్లు రాబట్టడం ధూరందర్‌కు కలిసి వచ్చింది.
ముఖ్యంగా నాలుగో వారం తర్వాత పుష్ప 2 వసూళ్లు సింగిల్ డిజిట్‌కు పడిపోగా, ధూరందర్ మాత్రం ఏడో వారం వరకు డబుల్ డిజిట్ వసూళ్లను టచ్ చేస్తూనే ఉంది. ఏడో వారం ముగిసే సమయానికి ధూరందర్ మొత్తం రూ. 829.40 కోట్లు సాధించగా, పుష్ప 2 హిందీ నెట్ వసూళ్లు రూ. 810.10 కోట్ల వద్ద నిలిచిపోయాయి. దీనివల్ల బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ధూరందర్ నిలిచింది. ఒక ఏడాది గ్యాప్‌లో ఇలాంటి కాంపిటీషన్ చూడటం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఫలితంతో అల్లు అర్జున్ నెక్స్ట్ డామినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన తదుపరి చిత్రం అట్లీ దర్శకత్వంలో AA22 భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. అట్లీకి హిందీ మార్కెట్ పై ఉన్న పట్టు, బన్నీకి ఉన్న క్రేజ్ తోడైతే మరోసారి హిందీ రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతం 'ధూరందర్' సాధించిన ఈ ఘనత రణవీర్ సింగ్ కెరీర్‌కు ఊపిరి పోయడమే కాకుండా, బాలీవుడ్ మార్కెట్ సత్తాను మళ్ళీ చాటి చెప్పింది.
ధూరందర్ vs పుష్ప 2.. హిందీ నెట్ బాక్సాఫీస్ తేడా (వారాల వారీగా):
మొదటి వారం: 207.25 కోట్లు / 425.10 కోట్లు
రెండో వారం: 252.25 కోట్లు / 196.50 కోట్లు
మూడో వారం: 172.00 కోట్లు / 103.05 కోట్లు
నాలుగో వారం: 106.50 కోట్లు / 53.75 కోట్లు
ఐదో వారం: 51.25 కోట్లు / 19.45 కోట్లు
ఆరో వారం: 26.35 కోట్లు / 8.00 కోట్లు
ఏడో వారం: 13.75 కోట్లు / 4.25 కోట్లు
మొత్తం వసూళ్లు (7 వారాల్లో): 829.40 కోట్లు / 810.10 కోట్లు