ప్రపంచ సినిమా హబ్‌గా చేయాలన్న సీఎం కల నెరవేరుతుంది: అల్లు అరవింద్
హైదరాబాద్ కోకాపేటలో అత్యంత వైభవంగా జరిగిన `అల్లు సినిమాస్` ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.;
హైదరాబాద్ కోకాపేటలో అత్యంత వైభవంగా జరిగిన `అల్లు సినిమాస్` ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి `ఫిలిం క్యాపిటల్`గా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల నిజం అవ్వాలని అన్నారు. సీఎం దృఢ నిర్ణయానికి సినిమా పరిశ్రమ ఎప్పుడూ అండగా ఉంటుందని.. ఆ దిశగా తాము వేసిన ఒక చిన్న అడుగు ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ అని ఆయన పేర్కొన్నారు.
సినిమా పరిశ్రమపై తమ కుటుంబానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను అల్లు అరవింద్ ఈ వేదికపై చాటిచెప్పారు. ``మా నాన్న గారు అల్లు రామలింగయ్య గారు, నేను, బన్నీ, ఇప్పుడు బన్నీ వాళ్ల అబ్బాయి అయాన్ కూడా ఈ పరిశ్రమలోనే ఉన్నాం. బన్ని కొడుకు (అయాన్ ) కూడా ఇప్పటికే ఇంట్లో వేషాలు వేస్తూ.., తానూ నటిస్తానని అంటున్నాడు. ఇలా నాలుగు తరాలుగా మేము ఈ ఇండస్ట్రీకే అంకితమై ఉన్నాం అని ఆయన గర్వంగా ప్రకటించారు. ఈ భూమి, ఈ థియేటర్ అన్నీ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే అంకితం చేస్తున్నామని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.
గత 50 ఏళ్ల కాలాన్ని గుర్తుచేసుకుంటూ.. ఒకప్పుడు సినీ పరిశ్రమను సమాజం `అంటరాని పరిశ్రమ`గా చూసేదని అరవింద్ గుర్తుచేశారు. అటువంటి రోజుల్లోనే తన తండ్రి తనను ప్రోత్సహించి.. ఈ రంగంలో దీక్షతో పనిచేయమని ధైర్యం చెప్పారని కొనియాడారు. తన ఎదుగుదలకు, అలాగే ఎందరో హీరోలకు స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ చిరంజీవి ని, ఎగ్జిబిషన్ రంగంపై తనకు ఆసక్తి కలిగించిన నారాయణ దాస్ ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాల్బీ సంస్థ గుర్తించిన మూడు అతిపెద్ద డాల్బీ సినిమాస్ థియేటర్లలో ఒకటి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై అరవింద్ గారు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి వారానికి 7 రోజులు కాదు.. ఏకంగా 14 రోజులు పనిచేసే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన అభివర్ణించారు. సీఎం నిర్ణయాలు ఎంతో వేగంగా ఉంటాయని `జస్ట్ డు ఇట్` తరహాలో ప్రజలకు మేలు జరుగుతుందంటే ఆలోచించకుండా తక్షణమే అమలు చేసే గుణం ఆయన సొంతమని రేవంత్ రెడ్డి పాలనా దక్షతను వేనోళ్ల కొనియాడారు.
చివరగా.. ఈ థియేటర్ నిర్మాణం వెనుక ఆర్థిక లాభాల కంటే తన సంతృప్తి, పరిశ్రమకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే తపనే ప్రధానమని అరవింద్ స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా ఇక్కడ మరేదైనా భవనం కడితే కోట్లాది రూపాయలు వచ్చేవని.. కానీ రిటైర్మెంట్ తర్వాత తాను చూసుకుని గర్వించదగ్గ ఒక గొప్ప కట్టడం ఉండాలని ఈ థియేటర్‌ను నిర్మించినట్లు తెలిపారు. తన ఆలోచనలకు తన కుమారులు బన్నీ, బాబీ, శిరీష్ పూర్తి మద్దతు ఇచ్చారని, అల్లు కుటుంబం ఎప్పటికీ సినీ కళకే అంకితమని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఏఏఏ సినిమాస్ లాంచ్ కార్యక్రమంలో ఎవరెవరు?
అల్లు సినిమాస్ (AAA సినిమాస్) గ్రాండ్ లాంచ్ వేడుక రాజకీయ, సినీ ప్రముఖుల కలయికతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి థియేటర్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో అల్లు కుటుంబ సభ్యులైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు బాబీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు ఏషియన్ సినిమాస్ ప్రతినిధులు, అంతర్జాతీయ డాల్బీ సంస్థకు చెందిన ముఖ్య అధికారులు , టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో అల్లు అరవింద్ గారు తమ కుటుంబానికి సినిమా రంగంపై ఉన్న మక్కువను చాటిచెప్పగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచడంలో అల్లు ఫ్యామిలీ చేస్తున్న కృషిని అభినందించారు. అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌గా మరిన్ని శిఖరాలను అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు. అత్యాధునిక సాంకేతికతతో ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌లలో ఒకటిగా నిలిచిన ఈ థియేటర్ లాంచ్ వేడుకలో సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు,సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.