తప్పుల్ని సరిదిద్దుకుంటూ 'దేవర2'!
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది.;
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది. కానీ కథనం ,కొన్ని సాంకేతిక అంశాలపై మిశ్రమ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వేగం తగ్గడం, క్లైమాక్స్ ట్విస్ట్ అర్థం కాకపోవడం వంటి అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో `దేవర 2` లో కొరటాల శివ ఆ తప్పులను సరిదిద్దుకుంటూ సినిమాను ఎలాంటి అంశాలు హైలైట్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరం.
తొలి భాగంలో వర పాత్ర లో భయం , అతడి అమాయకత్వంపై ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ రెండో భాగంలో వర పాత్ర విశ్వరూపాన్నిచూపించబోతున్నారు. తండ్రి దేవర ఆశయాలను వర ఎలా ముందుకు తీసుకెళ్లాడు? సముద్రం మీద తన ఆధిపత్యాన్ని ఎలా సుస్థిరం చేసుకున్నాడు? అనే పాయింట్‌ను హైలైట్ చేస్తూ వర పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. వర పాత్రపై వచ్చిన విమర్శలకు సమాధానం రెండవ భాగంలో మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి.
ముఖ్యంగా క్లైమాక్స్‌లో దేవర వర్సెస్ వర ట్విస్ట్‌పై చాలా సందేహాలున్నాయి. రెండో భాగంలో ఈ మిస్టరీని విడమర్చి చెప్పడమే కొరటాల ముందున్న లక్ష్యం. దేవర మరణం వెనుక ఉన్న అసలైన కారణం కుట్రలు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న భావోద్వేగపూరితమైన బంధాన్ని కొరటాల మరింత లోతుగా ఆవిష్కరిం చనున్నారు. ఈ ఎమోషనల్ డ్రామానే పార్ట్ 2 కి వెన్నెముకగా నిలవనుంది.
విమర్శల దృష్ట్యా కొరటాల శివ రెండో భాగంలో కథన వేగం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది. తొలి భాగంలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది. దీంతో పార్ట్ 2 లో స్క్రీన్ ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా మలచనున్నారు. సైఫ్ అలీ ఖాన్ (భైరా) , ఎన్టీఆర్ పాత్రల మధ్య సాగే మైండ్ గేమ్స్, ఎత్తుకు పైెత్తులు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా డిజైన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలం నుంచి తెలిసింది.
సాంకేతిక పరంగా కూడా కొరటాల కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. మొదటి భాగంలో సముద్రం లోపల వచ్చే కొన్ని విజువల్స్ పై విమర్శలున్నాయి. పార్ట్ 2 లో విఎఫ్ ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటాయంటున్నారు. అలాగే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ కాబట్టి రెండో భాగంలో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లను షేక్ చేయడం ఖాయం. సముద్ర గర్భంలో సాగే పోరాటాలు మరింత రియలిస్టిక్ గా మలచనున్నారు.
అలాగే జాన్వీ కపూర్ (తంగ) పాత్రను రెండో భాగంలో కేవలం పాటలకే పరిమితం చేయకుండా, కథలో కీలక భాగం చేయబోతున్నారు. వర - తంగం మధ్య నడిచే ప్రేమకథతో పాటు, కథను మలుపు తిప్పే కొన్ని సన్నివేశాల్లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండొచ్చు. మొదటి భాగం ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పాజిటివ్‌గా తీసుకుని ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పక్కా బాక్సాఫీస్ వండర్ గా కొరటాల శివ సిద్ధం చేస్తున్నారని తెలిసింది.