అల్లు అర్జున్ హాలీవుడ్‌లో నటించాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ కోకాపేటలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన `అల్లు సినిమాస్` ప్రారంభోత్సవ వేడుకలో తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.;

Update: 2026-03-12 17:42 GMT

హైదరాబాద్‌ కోకాపేటలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన `అల్లు సినిమాస్` ప్రారంభోత్సవ వేడుకలో తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుక‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై రేవంత్ త‌న‌దైన శైలిలో ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు అల్లు అర్జున్ హాలీవుడ్ లో న‌టించాల‌ని సీఎం ఆకాంక్షించ‌డంతో అహూతుల హ‌ర్ష‌ద్వానాల‌తో థియేట‌ర్ ప్ర‌తిధ్వ‌నించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ- అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కో లేదా ఇండియాకో పరిమితం కాలేదని అన్నారు. `పుష్ప` సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి తెలుగు వారి సత్తా చాటాలని ఆకాంక్షించారు. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని నటన, స్టైల్ బన్నీ సొంతమని ఆయన కొనియాడారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ సాధించడం మన అందరికీ గర్వకారణమని.. అత‌డి తదుపరి సినిమాలు అంతర్జాతీయ రికార్డులను తిరగరాయాలని సీఎం మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

హైదరాబాద్ నగరం ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందని.. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా రంగం కూడా హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని.. ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఐటీ రంగం, ఫార్మా రంగం త‌ర‌హాలోనే సినిమా రంగాన్ని కూడా ఒక ప‌రిశ్ర‌మ‌గా గుర్తించామ‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.

హాలీవుడ్‌తో తెలుగు సినిమా పోటీపడాలి

తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయిందని.. మన వాళ్లు తీస్తున్న సినిమాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అల్లు అరవింద్ తన అనుభవంతో హాలీవుడ్ చిత్రాలతో పోటీపడే రేంజులో సినిమాలను నిర్మించాలని.. దానికి అవసరమైన అన్ని ర‌కాల మ‌ద్ధ‌తు ఇస్తామ‌ని అన్నారు. హాలీవుడ్ రేంజు వసతులు ఈ `అల్లు సినిమాస్` వంటి మల్టీప్లెక్స్‌లలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అల్లు అరవింద్ గారి కృషిపై ప్రశంసలు

అల్లు అరవింద్ ఎంతో ప్యాషన్‌తో హాలీవుడ్ థియేట్రిక‌ల్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారని సీఎం ప్రశంసించారు. విదేశీ సాంకేతికతను ఇక్కడి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అల్లు ఫ్యామిలీ తెలుగు సినిమాను గ్లోబల్ లెవల్‌కు తీసుకువెళ్లడంలో ముందుందని పేర్కొన్నారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి .. అల్లు కుటుంబంతో ఈ వేదిక‌పై ఎంతో ఇదిగా క‌లిసిపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఒక హాలీవుడ్ స్టార్ రేంజ్ అని పొగిడేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. అలాగే హైద‌రాబాద్ న‌గ‌రంలో సినిమా స్థాయిని హాలీవుడ్ కి ధీటుగా తీర్చిదిద్దాల‌నే రేవంత్ త‌ప‌న అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆయ‌న ఈ వేదిక‌పైనే కాదు గ‌తంలో ప‌లు వేదిక‌ల‌పై హైద‌రాబాద్ లో సినీప‌రిశ్ర‌మ‌ను హాలీవుడ్ ని మించేలా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.




Tags:    

Similar News