రాధిక కామెంట్స్ నిజమే.. కానీ..

సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్న అంశంపై ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.;

Update: 2026-03-12 18:30 GMT

సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్న అంశంపై ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధర రూ.1000- 2000 వరకు ఉండటం సాధారణమైపోయింది. మొదటి వీకెండ్‌ లో ఎక్కువ కలెక్షన్లు సాధించాలనే ఉద్దేశంతో ధరలను పెంచుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా తమిళ మూవీ తాయి కళవి సినిమా సక్సెస్ మీట్‌ లో రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. సినిమాలో వయసు మీద పడిన మహిళ పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కంటెంట్ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.

అయితే సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మా సినిమా కేవలం 150 రూపాయల టికెట్ రేటుతోనే దాదాపు 60 కోట్లు వసూలు చేసింది. కానీ కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ.1500- 2000 వరకు ఉంటున్నాయి. మీరు కరెక్ట్‌ గా లెక్కలు వేస్తే మేమే వారికంటే పెద్ద సక్సెస్ సాధించినట్టే అవుతుంది. అదే నిజమైన సక్సెస్" అని ఆమె వ్యాఖ్యానించారు.

రాధిక చేసిన కామెంట్స్ చాలామంది స్టార్ హీరోల సినిమాలపై ఇండైరెక్ట్ కౌంటర్‌ గా భావిస్తున్నారు. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలో ఆమె కామెంట్స్ మరింత వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మంచి కథ, స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అధిక టికెట్ ధరలు లేకుండా సినిమాలు పెద్ద విజయాలు సాధించవచ్చని అంటున్నారు.

మరోవైపు కొందరు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్‌ తో సినిమాలు తెరకెక్కుతున్నందున నిర్మాతలు పెట్టిన పెట్టుబడి తిరిగి పొందడానికి టికెట్ ధరలు పెంచక తప్పదని వారు చెబుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమాల్లో వీఎఫ్ఎక్స్, భారీ సెట్స్, విదేశీ లొకేషన్లు వల్ల ఖర్చు పెరుగుతుందని వివరిస్తున్నారు.

దీంతో రాధిక వ్యాఖ్యలు కొంతవరకు నిజమే అయినప్పటికీ, ప్రతి సినిమాకు ఒకే విధంగా టికెట్ ధరలు నిర్ణయించడం సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. కంటెంట్‌ తో పాటు బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకుని ధరలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఏదేమైనా అందుబాటులో ఉండే ధరలతో సినిమాలు విడుదల కావాలా? లేక భారీ బడ్జెట్ సినిమాలకు అధిక ధరలు అవసరమా? అనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతోంది.

Tags:    

Similar News