అయోధ్య పుణ్యక్షేత్రంలో బచ్చన్ కుటుంబం సేవా యజ్ఞం!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన తండ్రి, ప్రఖ్యాత హిందీ కవి డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ జ్ఞాపకార్థం అయోధ్యలో ఓ స్మారక ధర్మశాలను నిర్మించాలని నిర్ణయించారు.

Update: 2026-09-16 19:30 GMT

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన తండ్రి, ప్రఖ్యాత హిందీ కవి డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ జ్ఞాపకార్థం అయోధ్యలో ఓ స్మారక ధర్మశాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూలైలో అమితాబ్ అయోధ్యలో భూమిని కొనుగోలు చేసిన వార్తలు వెలువడగా తాజాగా ఆ స్థలంలో ఆధ్యాత్మిక, సేవా కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్ ప్లాన్ ఆమోదం కోసం అయోధ్య అభివృద్ధి సంస్థ కి దరఖాస్తు దాఖలైంది. దశరథ్ పథ్ సమీపంలోని `ది సరయూ` ప్రాజెక్టులో అమితాబ్ 15 కోట్ల వ్యయంతో సేకరించిన స్థలంలో ఈ ధర్మశాలను నిర్మించనున్నారు. ప్రతిపాదిత భవనంలో 20 కంటే ఎక్కువ గదులు ఉండనున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దరఖాస్తు అందిన అనంతరం నిర్మాణ ప్రణాళికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి అయోధ్య అభివృద్ధి సంస్థ 15 రోజుల వ్యవధితో బహిరంగ నోటీసును విడుదల చేసింది. నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారిక ఆమోదం లభిస్తుందని అధికారులు తెలిపారు. అన్ని అనుమతులు లభిస్తే ఈ ఏడాది అక్టోబర్ నాటికి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయోధ్య అభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్ అనురాగ్ జైన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అమితాబ్ బచ్చన్ నుంచి 20 కంటే ఎక్కువ గదులతో కూడిన ధర్మశాల నిర్మాణం కోసం విన్నపం వచ్చిందని తెలిపారు. చట్టబద్ధమైన ప్రక్రియ ముగిసిన అనంతరం ప్లాన్ ఆమోదిస్తామని.. ఈ సదుపాయం ద్వారా అయోధ్యను సందర్శించే భక్తులకు, యాత్రికులకు మెరుగైన వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

అమితాబ్ తండ్రి డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ భారతీయ సాహిత్యంలో ప్రముఖ కవిగా, అనువాదకుడిగా పేరుగాంచడమే కాకుండా పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1935లో ఆయన రచించిన `మధుశాల` కావ్యం, షేక్‌స్పియర్ నాటకాల హిందీ అనువాదాలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన స్మారకార్థం అయోధ్య వంటి పవిత్ర స్థలంలో యాత్రికుల కోసం ధర్మశాలను నిర్మించడం విశేషం.

మరోవైపు 83 ఏళ్ల వయస్సులోనూ అమితాబ్ బచ్చన్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల రిటైర్మెంట్‌పై వచ్చిన రూమర్లను అమితాబ్ ఖండించారు. బ్లాగ్‌లో సమయం ఆలస్యమైంది, నిద్రపోయే సమయం అని రాసిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని.. తాను నటనకు గుడ్‌బై చెప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమితాబ్ `కౌన్ బనేగా కరోడ్‌పతి 18` షోకు వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా చిత్రం క‌ల్కి 2 లో అశ్వ‌థామ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News