హాలీవుడ్ లో తొలి దక్షిణాది చిత్రం రీమేక్!
తాజాగా ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో హాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న తొలి తమిళ చిత్రంగా 'మహారాజ' సరికొత్త చరిత్ర సృష్టించింది.
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి -దర్శక,నటుడు అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'మహారాజ' అంతర్జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. 2024లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టడమే కాకుండా విమర్శకుల నుండి అపారమైన ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో హాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న తొలి తమిళ చిత్రంగా 'మహారాజ' సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ చారిత్రాత్మక ఘనతపై 'మహారాజ' నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఓ ప్రముఖ హాలీవుడ్ మేజర్ స్టూడియో సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుందని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ నిథిలన్ సామినాథన్ స్క్రీన్ ప్లే, టేకింగ్ ఈ గ్లోబల్ గుర్తించేందుకు ప్రధాన కారణమని నెటిజన్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినిమా సత్తా ఏంటో? మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన మైలురాయిపై కోలీవుడ్ వర్గాలు గర్విస్తున్నాయి.
ఈ రీమేక్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న నటుడిపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హాలీవుడ్ స్టార్ నటుడు, ఆస్కార్ విజేత మాథ్యూ మెక్‌కానఘీ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం ఉందంటూ వస్తున్నాయి.ఈ విషయంపై చిత్ర నిర్మాతలలో ఒకరైన సుధన్ సుందరం ప్రచారంపై స్పందించారు. నెగోషియేషన్లు జరుపుతున్న ఏజెన్సీ హాలీవుడ్‌లోని ఓ టాప్ స్టార్‌తో చర్చలు జరుపుతోందని, మాథ్యూ పేరు కూడా ఆ జాబితాలో ఉండే అవకాశం ఉందని.. అయితే తుది నిర్ణయాన్ని ఆ సంస్థే ధృవీకరిస్తుందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ రీమేక్ ఒప్పందానికి ప్రధానంగా చైనాలో లభించిన విజయం ఎంతగానో దోహదపడింది. `మహారాజ` చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద 91 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. భారతీయ రీజనల్ సినిమాకి చైనా మార్కెట్‌లో ఈ స్థాయిలో ఆదరణ లభించడంతో హాలీవుడ్ ఏజెన్సీల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ రీమేక్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది.
దర్శకుడు నిథిలన్ సామినాథన్ తెరకెక్కించిన నియో-నాయర్ థ్రిల్లర్ చిత్రంలో విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్‌లతో పాటు సచనా నమిదాస్, మమతా మోహన్‌దాస్, నట్టి సుబ్రమణ్యం ముఖ్యమైన పాత్రల్లో నటించారు. పోయిన లక్ష్మి (చెత్తబుట్ట) కోసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే ఓ సామాన్య తండ్రి కథగా ప్రారంభమై, ఆ తర్వాత ఊహించని మలుపులు తిరిగే వైవిధ్యమైన పాయింట్‌తో సినిమా ప్రేక్షక లోకాన్ని మైమరిపించింది.
సాక్నిల్క్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహారాజ చిత్రం 199.20 కోట్ల గ్రాస్ (భారత్‌లో 72.43 కోట్ల నెట్) వసూలు చేసి 2024లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా దక్కిం చుకున్నట్లు సమాచారం. హాలీవుడ్, హిందీ రీమేక్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.