ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా.. డాడీ అరవింద్‌కి అల్లు అర్జున్ కాంప్లిమెంట్
హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `అల్లు సినిమాస్ (AAA సినిమాస్) ప్రారంభోత్సవ వేడుక ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.;
హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `అల్లు సినిమాస్ (AAA సినిమాస్) ప్రారంభోత్సవ వేడుక ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానుల హృదయాలను హత్తుకోవడమే కాకుండా.. తన తండ్రి అల్లు అరవింద్ దార్శనికతను ప్రపంచానికి చాటిచెప్పిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా `రేవంతన్న` అని సంబోధిస్తూ.. తమ తపనను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచినందుకు బన్నీ కృతజ్ఞతలు తెలిపారు.
అల్లు అర్జున్ తన ప్రసంగంలో తండ్రిపై ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ... నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు, ఆయన నా దేవుడు! అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం కేవలం ఒక వ్యాపార లావాదేవీ కాదని.. సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే `ప్యాషన్`తో చేసిన కృషి అని ఆయన స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే ఈ `అల్లు సినిమాస్` రూపంలో సాక్షాత్కరించిందని బన్నీ పేర్కొన్నారు.
అల్లు అరవింద్ ని `టెక్నాలజీ పయనీర్` గా అభివర్ణిస్తూ బన్నీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మన పరిశ్రమకు స్టీరియో సౌండ్ మాత్రమే పరిచయం ఉన్న రోజుల్లోనే.. `మాస్టర్` సినిమా ద్వారా మొట్టమొదటిసారిగా 5.1 సరౌండ్ సౌండ్ ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని గుర్తుచేశారు. టెక్నాలజీని ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని బన్నీ కొనియాడారు.
సినిమా రంగంలో ఒక పెద్ద మార్పును అరవింద్ ముందుగానే పసిగట్టారని బన్నీ తెలిపారు. సినిమాలు ఫిలిం రీళ్ల ద్వారా నడుస్తున్న కాలంలోనే.. ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో `ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా` అని పిలవవచ్చని బన్నీ వ్యాఖ్యానించారు.
భాషా పరిమితులను దాటి తెలుగు వారి కోసం ప్రత్యేకంగా `ఆహా` అనే మొట్టమొదటి ప్రాంతీయ ఓటీటీని ప్రారంభించడం అరవింద్ గారి ముందుచూపుకు నిదర్శనమని బన్నీ అన్నారు. కేవలం సినిమాలే కాకుండా.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా వినోదాన్ని కొత్త పుంతలు తొక్కించారని ప్రశంసించారు. ఇప్పడు అదే క్రమంలో ఆసియాలోనే అత్యంత భారీ స్క్రీన్లలో ఒకటిగా నిలిచిన `డాల్బీ విజన్` థియేటర్‌ను హైదరాబాద్‌కు అందించడం ద్వారా ఆయన మరో రికార్డు సృష్టించారని తెలిపారు.
అంతిమంగా.. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని అల్లు అర్జున్ ప్రతినబూనారు. తమ కలలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ.. హైదరాబాద్‌ను ప్రపంచ ఎంటర్‌టైన్మెంట్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని బన్నీ తన ప్రసంగాన్ని ముగించారు.